Congress: అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు

రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానించడమేనని విపక్ష పార్టీల నేతలు కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు మండిపడ్డారు.
అమిత్ షా తన పదవికి రాజీనామా చేసి, క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో షా వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు జరిగాయి. మహారాష్ట్రలోని లాతూర్‌లో వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) నేతృత్వంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే షాపై ఆయన రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్‌ను అవమానించిందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం పేర్కొన్నారు.
ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివాదస్పద వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం నాడు పార్లమెంట్‌లో జరిగిన తోపులాటలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే ఈ ఘటన జరిగిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీంతో రాహుల్ పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈరోజు (డిసెంబర్ 20) దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. బీఆర్ అంబేడ్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ చివరి రోజైన ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్, హేమంగ్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు సెక్షన్ 117, 115, 125, 131, 351తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, పార్లమెంట్ హౌస్‌లోని ఏ గేటు వద్ద కూడా ఏ పార్టీకి చెందిన ఎంపీలు నిరసనకు దిగకూడదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవద్దని, నిరసన వ్యక్తం చేయవద్దని స్పీకర్ ఓం బిర్లా ఎంపీలందరికీ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com