PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోడీ పర్యటన..

ప్రధాని మోడీ శుక్రవారం బీహార్, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు మోడీ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం కూడా బీహార్‌లో పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో మూడు కొత్త మెట్రో లైన్లను ప్రారంభించనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం రూ.18,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీహార్‌లో రూ.13,000 కోట్లు, బెంగాల్‌లో రూ.5,200 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
గయ, పాట్నా, బెగుసరాయ్‌లో నాలుగు గంటల పాటు మోడీ పర్యటించనున్నారు. గయ, బక్సర్‌లో రూ. 6,880 కోట్ల వ్యయంతో నిర్మించిన 660 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. ఉత్తర బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌ను పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే నమామి గంగే కార్యక్రమం కింద ముంగేర్‌లో రూ.520 కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని కూడా ప్రారంభించనున్నారు. అదనంగా బీహార్ అంతటా దాదాపు రూ.1,260 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక గయ నుంచి రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. గయ-ఢిల్లీకి అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, బీహార్‌లోని వైశాలి-జార్ఖండ్‌లోని కోడెర్మాతో అనుసంధానించే బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రత్యేక రైలును ప్రారంభించనున్నారు.
ఇక సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లో మోడీ పర్యటించనున్నారు. రూ.5,200 కోట్లకు పైగా విలువైన రవాణా ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు కోల్‌కతా మెట్రో మూడు కొత్త విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. అలాగే అదనంగా కోనా ఎక్స్‌ప్రెస్‌వేపై రూ.1,200 కోట్లకు పైగా విలువైన 7.2 కి.మీ ఎలివేటెడ్ కారిడార్‌కు పునాది వేయనున్నారు. హౌరా-కోల్‌కతా మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com