Shubanshu Shukla: నేడు రోదసిలోకి శుభాన్షు శుక్లా

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపడుతున్నారు. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ (1984లో) తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండవ భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించబోతున్నారు. 41 ఏండ్ల తర్వాత రోదసిలో అడుగుపెడుతున్న భారతీయుడిగా ఆయన పేరు రికార్డులకు ఎక్కనున్నది. లక్నోకు చెందిన శుభాన్షు శుక్లా, 2006లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్నారు. గగన్‌యాన్ మిషన్ కోసం ఏర్పాటుచేసిన ‘భారత వ్యోమగామి దళం’కు 2019లో ఎంపికయ్యారు.
శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర 2019లో మొదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ద్వారా ఎంపికైన శుభాన్షు, 2021 నాటికి రష్యాలో యూరీ గగారిన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులోని ISRO అస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో అధునాతన శిక్షణను పొందారు. 2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గగనయాన్‌కు ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్షు కూడా ఒకరు. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ప్రయోగించాలనే లక్ష్యంగా ఉంది.
Ax-4 మిషన్ ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఇందులో భారతదేశానికి చెందిన తొలి ప్రైవేట్ వ్యోమగామిగా శుభాన్షు పాల్గొంటున్నారు. NASA మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వంలోని బృందంలో శుభాన్షు మిషన్ పైలట్‌గా వ్యవహరించనున్నారు. NASA, ISRO, ESA, JAXA లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ISSలో రెండు వారాలపాటు శాస్త్రీయ పరిశోధనలు, విద్యా కార్యక్రమాలు చేపడతారు.
శుభాన్షు శుక్లా బాల్యం నుంచి అంతరిక్ష దాకా..
1985 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించిన శుభాన్షు, 1999లో కార్గిల్ యుద్ధం వల్ల ప్రేరణ పొందారు. 2005లో NDA నుంచి B.Sc (Computer Science) పూర్తి చేసి, అనంతరం IISc బెంగళూరులో M.Tech (Aerospace Engineering) చేశారు. 2006లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన ఆయన, Su-30 MKI, MiG-29 వంటి యుద్ధ విమానాలపై 2,000 గంటల పైగా ఫ్లయింగ్ అనుభవం కలిగి ఉన్నారు. శుభాన్షు భార్య డాక్టర్ కామ్నా శుక్లా డెంటిస్ట్ కాగా, వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. తల్లి ఆశా శుక్లా గృహిణి కాగా, తండ్రి శంభు దయాల్ శుక్లా రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. సోదరీమణులిద్దరూ – నిధి (MBA), సుచి (ఉపాధ్యాయురాలు) – తమ సోదరుడి కోసం భావోద్వేగంతో వేచి చూస్తున్నారు. అంతరిక్ష ప్రయాణానికి శుభాన్షు తీసుకెళ్తున్న 'ఖానే కా డబ్బా' అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ఆయనకు ఇష్టమైన ఆమ్రాస్ (మలిహాబాద్ మామిడి), మూంగ్ దాల్ హల్వా, గజర్ కా హల్వా, స్టీమ్డ్ బాస్మతి రైస్ ఉన్నాయి. ఇవన్నీ ISRO ఫుడ్ సైన్స్ విభాగం సహకారంతో తయారు చేసి, NASA భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్యాక్ చేశారు. ఇవి కేవలం ఆహారం మాత్రమే కాదు – కుటుంబాన్ని, జ్ఞాపకాలను ప్రతిబింబించే చిహ్నాలు. లక్నోలోని వారి ఇంట్లో శాంతి పూజలు, సత్యనారాయణ కథలు, హవన్లు నిర్వహించి శుభాన్షు విజయాన్ని కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com