Toll Charges Increase 2024 : ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంపు

ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ ఆదివారం ప్రకటించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్‌బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్‌ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను పెంచింది.
ప్రస్తుతం పెరిగిన టోల్ఛార్జ్లు ఇవాళ్టి (జూన్ 3వ తేదీ) నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ రకాల వాహనాలను ఆరు కేటగిరీలుగా నిర్వాహకులు విభజించి ఛార్జీలను నిర్ణయించారు. వాహనదారులకు ధరలపై ఆందోళన లేకుండా టోల్‌ప్లాజాల వద్ద బోర్డులను ఏర్పాటు చేసినట్టు నిర్వహణ సంస్థ తెలిపింది. కొత్త టోల్ రేట్లు, నెలవారీ, రోజువారీ పాసుల కోసం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ https://www.hmda.gov.in/ ను సంప్రదించాలని సూచించింది.
ప్రతి సంవత్సరం టోల్ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీన పెంచుతుంటారు. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దేశంలో జూన్ 1న చివరి దశ పోలింగ్ ముగియడంతో టోల్ ధరలు పెంచుకునేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు వర్తిస్తాయని నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ టోల్ ఛార్జీలు దేశవ్యాప్తంగా కూడా పెరిగాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com