అప్పుడు కిలో రూ.300.. ఇప్పుడు 30 పైసలు..

అప్పుడు కిలో రూ.300.. ఇప్పుడు 30 పైసలు..
ఏ కూరగాయల ధర ఇలా ఉండదు.. ఒక్కోసారి ధరలు ఆకాశంలో ఉండి ఎవరికీ అందుబాటులో ఉండవు..

ఏ కూరగాయల ధర ఇలా ఉండదు.. ఒక్కోసారి ధరలు ఆకాశంలో ఉండి ఎవరికీ అందుబాటులో ఉండవు.. మరోసారి కనీసం గిట్టుబాటు ధర లభించక పండిన పంటంతా రోడ్ల మీద పారబోస్తుంటారు. మూడు నెలల క్రితం కేజీ రూ.300లు పలికిన టమాట ధర ఈ రోజు 30 పైసలంటే పాపం ఆ రైతుకి కన్నీళ్లు తప్ప మరేం మిగులుతాయి. ధర పెరిగినప్పుడే తినాలనిపిస్తుందేమో.. ఇప్పుడు కొనేవాళ్లు లేక రోడ్డు మీద పారబోస్తున్నారు. పంట పండించిన రైతు రవాణా ఛార్జీలు కూడా రావనే ఉద్దేశంతో రోడ్డు పక్కన పారబోస్తున్నారు.

నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లలో టమాటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి. 25 కేజీల బాక్స్ 10 రూపాయల నుంచి 35 రూపాయలు పలుకుతోంది. అంటే కేజీ టమాటా ధర 30 నుంచి 40 పైసలు. గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది.

టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. జూన్, జులై నెలలో పెరిగిన టమాటా ధరలు రైతులను కోటీశ్వరులను చేస్తే ఇప్పుడు మళ్లీ వారిని రోడ్డు మీద పడేసింది. కొన్ని రోజుల పాటు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురుస్తూ నష్టాలు కలిగిస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story