రేపు అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె నగరాల్లో మోదీ పర్యటన

కరోనా విజృంభిస్తున్న వేళ..టీకా కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం దేశంలోని మూడు నగరాల్లో పర్యటించనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి చేస్తున్న సంస్థల్ని ఆయన సందర్శిస్తారు. కోవిడ్ టీకా పురోగతి పనులను సమీక్షించనున్నారు. అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె నగరాల్లో మోదీ పర్యటిస్తారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థను, పుణెలోని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని విజిట్ చేస్తారని పీఎంవో కార్యాలయం తన ట్విట్టర్ వెల్లడించింది.
కోవిడ్‌పై పోరాటంలో భారత్ కీలక దశకు చేరుకుందని, టీకా ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను సందర్శించడం, అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడటం వల్ల టీకా గురించి సమగ్ర సమచారం తెలుస్తుందని పీఎంవో తన ట్వీట్‌లో పేర్కొంది. దేశ పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎదురయ్యే సవాళ్లను, కార్యాచరణను తయారు చేసేందుకు ఈ పర్యటన వీలవుతుందని పీఎంవో తన ప్రకటనలో వెల్లడించింది.
దేశీయంగా 'కరోనా' టీకా తయారీ యత్నాల్లో భారత్ బయోటెక్ క్రియాశీలకంగా ఉంది. ఈ సంస్థ ఆవిష్కరిస్తున్న కరోనా టీకా- కొవాగ్జిన్‌పై మొదటి, రెండు దశల క్లినికల్ పరీక్షలు పూర్తయి, ఇటీవల మూడో దశ పరీక్షలు మొదలయ్యాయి. ఇవి పూర్తయిన వెంటనే ప్రభుత్వం దీనికి అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చే అవకాశం లేకపోలేదు. దేశ ప్రజలందరికీ సాధ్యమైనంత తక్కువ ఖర్చులో టీకా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com