M P Road Accident పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి 13మంది మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోని మోతీపురా ప్రాంతానికి చెందిన 30మంది బృందం మధ్యప్రదేశ్‌లోని కులామ్పుర్లో జరిగే పెళ్లికి ట్రాక్టర్లో బయలుదేరింది. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌గఢ్ జిల్లాలోని పీప్లోడీ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13మంది మరణించారు. గాయపడిన వారిలో 13మందిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని చికిత్స కోసం భోపాల్‌కు తరలించారు. అయితే వీరికి ప్రాణాపాయం లేదని జిల్లా కలెక్టర్ హర్ష దీక్షిత్ తెలిపారు.
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, బాధితులకు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో 13మంది మరణించడం భాదకరమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. 'ఘటన స్థలానికి రాజ్‌గఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి నారాయణ్ సింగ్ పన్వార్ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదించాం. ఆ రాష్ట్ర పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు రాజ్‌గఢ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నవారిని భోపాల్‌కు తరలించాం. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని సీఎం మోహన్ యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com