భక్తుల పాదయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆర్గనైజర్ మృతి

రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుని తరించాలనుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో 500 మంది భక్తులు కర్ణాటక నుంచి కాలినడకన పయనమయ్యారు. ఇంతలో మృత్యువు యాక్సిడెంట్ రూపంలో ముంచుకొచ్చింది. ఆర్గనైజర్ అక్కడికక్కడే మృతి చెందారు. అపశకునంగా భావించిన 500 మంది భక్తులు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
కర్నూలు జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగుప్ప మండలం కరూర్ కు చెందిన వీరభద్రారెడ్డి ఆధ్వర్యంలో 500 మంది భక్తులు మంత్రాలయంకు కాలినడకన బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున మంత్రాలయం శివారుకు చేరుకున్నారు. మరో అరగంటలో స్వామి వారిని దర్శించుకునేవారు.
కానీ అంతలోనే తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి పట్టణంలోకి వస్తున్న ఆటో వీరభద్రారెడ్డిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 ఏళ్లుగా ఆయన సోదరుడు ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఆయన మరణానంతరం అతని తమ్ముడు వీరభద్రారెడ్డి గత ఎనిమిదేళ్లుగా ఈ పాదయాత్ర బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు.
వీరభద్రారెడ్డి మరణంతో కలత చెందిన భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. వీరభద్రారెడ్డికి భార్య జయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామిని దర్శించుకోవడానికని వచ్చి ఇలా పాదయాత్రలో ప్రాణాలు కోల్పోవడం భక్తులను కలచి వేసింది. ఈ ఘటన బళ్లారిలో తీవ్ర విషాదాన్ని నింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com