TRAI: స్పామ్ కాల్స్‌పై టెల్కోలకు ట్రాయ్ కీలక ఆదేశాలు

రిజిస్టర్ కాని టెలీమార్కెటర్లు స్పామ్ కాల్స్ చేస్తున్నట్లు గుర్తించిన టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మంగళవారం టెల్కోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే అలాంటి నెంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని టెల్కోలను ఆదేశించింది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు పెద్ద ఎత్తున కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్ లిస్టులో చేర్చాలని పేర్కొంది.
తమ తాజా ఆదేశాలు పాటించాలని, తీసుకున్న చర్యలపై పదిహేను రోజులకోసారి రెగ్యులర్ అప్ డేట్స్ సమర్పించాలని సూచించింది. ఈ నిర్ణయాత్మక చర్యతో వినియోగదారులకు స్పామ్ కాల్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని ట్రాయ్ పేర్కొంది. పెరుగుతున్న సైబర్ నేరాలను, స్పామ్ కాల్స్ పేరుతో పెరుగుతున్న నేరాలను గుర్తించిన ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిబంధనలను పాటించకుండా ఏ కంపెనీ అయినా ప్రమోషనల్ కాల్స్ చేస్తే రెండేళ్ల పాటు సదరు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతామని ట్రాయ్ స్పష్టం చేసింది. తక్షణం ప్రమోషల్ కాల్స్ నిలిపేయడమే కాకుండా అలాంటి కాల్స్‌పై తీసుకున్న చర్యల గురించి త్వరగా వివరణ ఇవ్వాలి అని చెప్పుకొచ్చింది. నెలవారీగా 1, 16వ తేదీల డేటాను తమకు సమర్పించాలని పేర్కొంది. కాగా, ఈ అంశంపై గత వారం జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ లాంటి మొబైల్ కంపెనీల చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్లతో ట్రాయ్ చీఫ్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆదేశాలు వెలువరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com