Shubhanshu Shukla: అంతరిక్ష ప్రయాణం కంటే బెంగళూరు ట్రాఫిక్‌ను దాటడమే కష్టం.. వ్యోమగామి శుభాన్షు శుక్లా

అంతరిక్ష ప్రయాణం కన్నా బెంగళూరు నగరంలోని ట్రాఫిక్‌లో ప్రయాణించడమే చాలా కష్టమని భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా చమత్కారంతో కూడిన చురక అంటించారు. గురువారం జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సభికులను నవ్వించడమే కాకుండా, నగరం ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను మరోసారి ఎత్తిచూపాయి.
సదస్సులో మాట్లాడిన శుక్లా, "నేను నగరం అవతలి వైపున్న మారతహళ్లి నుంచి ఇక్కడికి వస్తున్నాను. మీ ముందు నేను చేయబోయే ప్రసంగానికి పట్టే సమయం కన్నా, ఇక్కడికి చేరుకోవడానికి మూడు రెట్లు ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడిపాను. నా నిబద్ధతను మీరు అర్థం చేసుకోవాలి" అని నవ్వుతూ అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా శుక్లా జులైలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 41 ఏళ్ల అనంతరం భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన నిలిచారు.
శుక్లా వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. "అంతరిక్షం నుంచి బెంగళూరుకు రావడం సులువే కానీ, మారతహళ్లి నుంచి వేదిక వద్దకు రావడం కష్టమైందని శుక్లా అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు జరగకుండా చూస్తాం" అని ముగింపు ప్రసంగంలో హామీ ఇచ్చారు.
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే సగటు ప్రయాణ సమయం 54 నిమిషాల నుంచి 63 నిమిషాలకు పెరిగింది. 2025 మొదటి ఆరు నెలల్లోనే నగరంలో మూడు లక్షలకు పైగా కొత్త ప్రైవేట్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం ప్రతిపాదించిన టన్నెల్ రోడ్ ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న తరుణంలో వ్యోమగామి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

