Mamata Banerjee: పార్టీకి కొత్త చిక్కులు.. టీఎంసీ అధినేత్రి మమతలో కలవరం.?

Mamata Banerjee: పార్టీకి కొత్త చిక్కులు.. టీఎంసీ అధినేత్రి మమతలో కలవరం.?
Mamata Banerjee: దేశమంతటా విస్తరించాలని ఆరాటపడుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి.

Mamata Banerjee: దేశమంతటా విస్తరించాలని ఆరాటపడుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి.. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి నిజమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని, ప్రధాని అభ్యర్థిగా నిలబడాలని మమతా బెనర్జీ కలలు కంటుంటే.. వరుస కుంభకోణాలతో ఆ పార్టీ నేతలు అరెస్టవుతున్న తీరుతో అసలు టీఎంసీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తోంది..

అగ్ర నేతల అరెస్టులతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీలో కలవరం మొదలైనట్టుగా కనిపిస్తోంది.. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని ఈడీ అరెస్టు చేయగా.. ఆవుల అక్రమ రవాణా కేసులో అనుబ్రత మోండల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇక అభిషేక్ బెనర్జీ, ఆయన సతీమణి రుజిర బెనర్జీలను ప్రశ్నించేందుకు ఈడీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. విద్యా శాఖ మంత్రి పరేష్ అధికారిని ప్రశ్నించేందుకు కోల్‌కతా హైకోర్టు సీబీఐకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆయన తన కుమార్తె అంకితను ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నియమించినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

దీంతో ఆ కళంకాన్ని తొలగించుకునేందుకు మమతా బెనర్జీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు అధినేత్రికి ఫోన్‌ చేసి వేడుకుంటున్నా ఆమె కనికరించడం లేదు.. మొన్నటి పార్థ ఛటర్జీ ఎపిసోడ్‌లో, నిన్నటి అనుబ్రత మోండల్‌ విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు.. అవినీతికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అయితే, బలమైన నేతలంతా ఒక్కొక్కరుగా అరెస్టవుతుండటంతో టీఎంసీ వర్గాలు ఆత్మరక్షణలో పడ్డాయి.. అయితే, పార్టీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు అధినేత్రి ప్రక్షాళన మంత్రాన్ని పటిస్తున్నారు.

మమత ఆదేశాలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ జిల్లా స్థాయి నాయకులతో చర్చలు జరుపుతున్నారు. 15 రోజులుగా అభిషేక్ బెనర్జీ ఉత్తర బెంగాల్, పశ్చిమ జిల్లాలకు చెందిన టీఎంసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దక్షిణ బెంగాల్ నేతలతోనూ చర్చలు జరపనున్నారు.. 2023లో జరిగే పంచాయతీ ఎన్నికల కోసం ప్రతి జిల్లాలోనూ బ్లాకులవారీగా నేతలతో సమావేశాలు ఇప్పటికే పూర్తయినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.. ప్రతి జిల్లాలో ఏమేం పనులు చేయాలి.. ఏం చేయకూడదు అనే అంశాలతో కూడిన లిస్టు కూడా రెడీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టీఎంసీ అధ్యక్షులను మార్చగా.. జిల్లా కార్యవర్గాల్లో సైతం భారీగా ప్రక్షాళన జరగబోతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిజాయితీగా పనిచేసే వారికే జిల్లా కమిటీల్లో పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీలోని కీలకమైన జిల్లా, యువజన, విద్యార్థి, మహిళ, ట్రేడ్ యూనియన్ విభాగాల్లో నిజాయితీపరులు, విశ్వసనీయత కలిగిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని టీఎంసీ అధినాయకత్వం ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆ దిశగానే రిక్రూట్‌మెంట్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి, మమతా బెనర్జీ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story