Rampur Road Accident: బొలెరో వాహనంపై బోల్తాపడిన లారీ

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఊక లోడుతో వెళ్తున్న ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి కారుపై బోల్తా పడటంతో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయానక ఘటన రాంపూర్-నైనిటాల్ హైవేపై ఉన్న పహాడీ గేట్ కూడలి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. హైవేపై ఉన్న ఒక కట్ వద్ద బొలెరో వాహనం మలుపు తీసుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఊక లోడు ట్రక్కు దానిని తప్పించబోయింది. ఈ క్రమంలో ట్రక్కు చక్రం రోడ్డు డివైడర్‌ను ఎక్కడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న బొలెరోపై పూర్తిగా పడిపోయింది. దీంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. లారీలోని ఊక మొత్తం బొలెరోపై పడిపోయింది.
ప్రమాదానికి గురైన బొలెరో వాహనం స్థానిక విద్యుత్ శాఖ సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డీవో)దిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అధికారి కారులో లేరు. డ్రైవర్ ఆయన్ను సబ్‌స్టేషన్‌లో దింపి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అగ్నిమాపక దళం, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ క్రేన్ సహాయంతో ట్రక్కును పక్కకు తొలగించి, కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదం కారణంగా రాంపూర్-నైనిటాల్ హైవేపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ట్రక్కు అదుపుతప్పడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

