Highway Explosions: జైపూర్-అజ్మీర్ హైవేపై భారీ ప్రమాదం
జైపూర్-అజ్మీర్ రహదారిపై మంగళవారం రాత్రి భారీ ప్రమాదంజరిగింది. ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కును ట్యాంకర్ ఢీకొట్టింది. ఆ ప్రమాదం వల్ల పేలుళ్లు జరిగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గ్యాస్ సిలిండర్లు పేలుతున్న సమయంలో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు జైపూర్ ఐజీ రాహుల్ ప్రకాశ్ తెలిపారు.
సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కుకు చెందిన డ్రైవర్‌ను ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సీఎంహెచ్‌వో రవి షెకావత్ తెలిపారు. సీఎం భజన్‌లాల్ శర్మ ఆదేశాల ప్రకారం డిప్యూటీ సీఎం ప్రేమ్ చాంద్ బైర్వా ఘటనా స్థలిని సందర్శించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నది. దుడా ఏరియాలో జరిగిన ప్రమాద ప్రదేశానికి పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నది. హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ట్రక్కులో ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు మిస్సింగ్‌లో ఉన్నట్లు బైర్వా తెలిపారు. వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించినట్లు ఇంత వరకు అధికారిక సమాచారం లేదు. ఎల్‌పీజీ సిలిండర్ల వెళ్తున్న ట్రక్కు ఓ హోటల్ బయట పార్కింగ్ చేసి ఉందని, ఆ సమయంలో డ్రైవర్ భోజనం చేస్తున్నాడని, అయితే వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ దాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కూడా జైపూర్ హైవేపైనే ఎల్‌పీజీ ట్యాంకర్‌ను ఓ ట్రక్కు ఢీకొన్నది. ఆ సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఆ ప్రమాదంలో సుమారు 19 మంది మరణించిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com