Truckers : కేంద్రప్రభుత్వంతోట్రక్‌ డ్రైవర్ల సంఘం చర్చలు సఫలం

Truckers : కేంద్రప్రభుత్వంతోట్రక్‌ డ్రైవర్ల  సంఘం చర్చలు సఫలం
ప్రభుత్వ హామీతో వెనక్కి తగ్గిన డ్రైవర్లు

కేంద్రప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం చర్చలు సఫలం కావడంతో ట్కక్కు డ్రైవర్ల సమ్మె విరమించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌ ’ కేసులకు కఠిన శిక్షల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను ట్రక్కు డ్రైవర్లు నిలిపేసారు. డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌(ఏఐఎంటీసీ) ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, కొత్త నిబంధనలపై చర్చలు జరిపిన తర్వాతనే అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమణకు ఏఐఎంటీసీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సమ్మె విరమించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చింది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఏఐఎంటీసీతో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అసోసియేషన్‌ చైర్మన్‌ మల్కిత్‌ సింగ్‌ బాల్‌ పేర్కొన్నారు. అజయ్‌భల్లాతో సమావేశం అనంతరం సమ్మె విరమణను ప్రకటించిన ఏఐఎంటీసీ.. ట్రక్కు డ్రైవర్లు తిరిగి విధులకు వెళ్తారని ప్రకటించింది.

హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల వరకు శిక్ష విధించే కొత్త నిబంధన ఇంకా అమలు కాలేదని, రవాణా శాఖతో చర్చించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. హిట్ అండ్ రన్ చట్టంలోని కొత్త శిక్షాస్మృతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను ఉపసంహరించుకుంటామని ట్రక్కర్స్ అసోసియేషన్ తెలిపింది. హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల శిక్ష విధించే చట్టంపై ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌తో చర్చ జరిగింది.


‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసులకు కఠిన శిక్షలు ప్రతిపాదించడంపై ట్రక్కు డ్రైవర్లు భగ్గుమన్నారు. మూడు రోజుల సమ్మెలో భాగంగా మంగళవారం రెండో రోజు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొత్త నిబంధనలు ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో రవాణా కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్ల ఆందోళనలతో బండ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ర్టాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్‌ బంకుల ముందు బారులు తీరారు. ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకొనేందుకు భారీగా క్యూలు కట్టారు. కొంత మంది అయితే ఆయిల్‌ కోసం బాటిళ్లు, క్యాన్లు తీసుకొచ్చారు. అకస్మాత్తు డిమాండ్‌తో ఉన్న నిల్వ అయిపోవడంతో బంకుల ముందు నో స్టాక్‌ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. వాహనదారులు బంకులకు పోటెత్తడంతో.. ఆయా ప్రాంతాల్లో పెద్దయెత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సోమవారం కూడా పలు రాష్ర్టాల్లోని ఆయిల్‌ బంకుల వద్ద ఈ విధమైన పరిస్థితి కనిపించింది. డ్రైవర్ల ఆందోళనలు కొనసాగితే రోజువారీ ప్రయాణాలు, నిత్యావసర సరుకుల రవాణా, పాఠశాలలపైనా ప్రభావం పడే అవకాశం ఉండేది.

Tags

Read MoreRead Less
Next Story