Canada: కెనడా వెళ్లే విద్యార్థులు జాగ్రత్త

Canada:  కెనడా వెళ్లే విద్యార్థులు జాగ్రత్త
X
భారత దౌత్యవేత్త సంజయ్‌ వర్మ హెచ్చరిక

ఉన్నత చదువులు చదివేసి, పెద్ద ఉద్యోగాలు చేసేసి జీవితంలో స్థిరపడిపోవాలన్న ఆశతో కెనడా వెళ్లాలనుకునే వారికి ఇది హెచ్చరిక. లక్షలకు లక్షలు ఖర్చు చేసి కెనడా వెళ్లి.. నాణ్యతలేని కాలేజీల్లో చదివి ఉద్యోగాలు దొరక్క డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్న వారు ఎందరో ఉన్నారట. భారతీయ రాయబారి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన హయాంలో వారానికి ఇద్దరు విద్యార్థులను బాడీ బ్యాగుల్లో భారత్‌ పంపిన సందర్భాలు ఉన్నాయని 2022 నుంచి కెనడాలో భారత రాయబారిగా పనిచేసిన సంజయ్‌వర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జీవితంలో వైఫల్యం చెందిన విద్యార్థులు కుటుంబ సభ్యులకు ఆ బాధను చెప్పుకోవడం మాని ఆత్మహత్యలు ఎంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖలిస్థానీ వివాదంతో భారత్‌-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ నెల మొదట్లోనే ఆయన తిరిగి భారత్‌కు చేరుకున్నారు. భారత్‌-కెనడా మధ్య సంబంధాలు బాగున్నా సరే తమ పిల్లలను అక్కడికి పంపేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని తల్లిదండ్రులకు వర్మ సలహా ఇచ్చారు. ‘భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ అక్కడికి వెళ్తారు. కానీ, బాడీ బ్యాగుల్లో తిరిగి ఇక్కడికొస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు అక్కడ కొన్నిసార్లు ఇరుకైన డార్మిటరీల్లో ఉంటున్నారని, కొన్నిసార్లు ఒక చిన్న రూములో 8 మంది నిద్రిస్తున్నారని తెలిపారు. కష్టపడి చదివి ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక ఇంజినీర్‌గా మంచి ఉద్యోగం చేస్తాడని అనుకుంటామని, కానీ అక్కడ అతడిని ఓ క్యాబ్‌ డ్రైవర్‌గా, ఓ షాప్‌లో చాయ్‌ సమోసా అమ్ముకునే వ్యక్తిగా చూస్తామని చెప్పారు. ఆగస్టులో ప్రభుత్వం పార్లమెంటులో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు.

Tags

Next Story