Donald Trump: ఖమేనీ ఒక 'జబ్బు మనిషి' - ట్రంప్,

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ సంచలన పిలుపునిచ్చారు. ఖమేనీ ఒక 'జబ్బు మనిషి' అని తీవ్రంగా విమర్శించారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సుప్రీం లీడర్‌ను తొలగించాలని బహిరంగంగా పిలుపునివ్వడం ఇదే తొలిసారి.
పొలిటికో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరణాలకు ట్రంపే కారణమని, ఆయనో 'నేరస్థుడు' అని ఖమేనీ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్ "అధికారం కోసం వేలాది మందిని చంపడం మాని, దేశాన్ని సరిగా నడపడంపై ఖమేనీ దృష్టి పెట్టాలి. నాయకత్వం అంటే గౌరవం, భయం లేదా మరణం కాదు" అని అన్నారు.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఇరాన్‌లో ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల్లో 'వేలాది మంది' చనిపోయారని స్వయంగా ఖమేనీ అంగీకరించడం గమనార్హం. అయితే, మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం మృతుల సంఖ్య 3,400 దాటి ఉంటుందని అంచనా.
మరోవైపు, ఇరాన్ విషయంలో అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయని వైట్‌హౌస్ ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

