Vijay: సీబీఐ విచారణకు హాజరైన విజయ్, కరూర్ తొక్కిసలాట ఘటనలో సమన్లు

Vijay: సీబీఐ విచారణకు హాజరైన విజయ్, కరూర్ తొక్కిసలాట ఘటనలో సమన్లు
X
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న టీవీకే చీఫ్

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సీబీఐ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. గతేడాది కరూర్ లో టీవీకే ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.

పలువురు ప్రత్యక్ష సాక్షులను విచారించిన అధికారులు.. విచారణకు రమ్మంటూ ఇటీవల విజయ్ కు సమన్లు పంపించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం విజయ్ ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు వెళ్లారు. తొక్కిసలాట ఘటనను తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కుట్రగా విజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అసలు నిజాలు బయటకు రావాలని, సమగ్ర స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై టీవీకే తరఫున ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించగా.. విచారణకు సహకరిస్తానని విజయ్ ప్రకటించారు. కాగా, తమ నాయకుడు విజయ్ కు భద్రత కల్పించాలని టీవీకే పార్టీ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ప్రచారాలు కూడా ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే విజయ్ కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఒక్కసారిగా తోపులాట జరగడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక విజయ్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా? లేదంటే సింగల్‌గా వెళ్తారా? అన్న తేలాల్సి ఉంది.

Tags

Next Story