Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటన.. 41కి చేరిన మృతుల సంఖ్య

నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నిర్వహించిన ప్రచార సభలో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన ఈ సభలో తొక్కిసలాట జరిగి మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళితే... శనివారం సాయంత్రం వేలాయుధంపాలెంలో ఏర్పాటు చేసిన సభకు విజయ్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. అంచనాలకు మించి జనం రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విజయ్‌ను దగ్గర నుంచి చూసేందుకు ప్రజలు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం, అదే సమయంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
బయటకు వెళ్లే దారులు ఇరుకుగా ఉండటంతో తొక్కిసలాట జరిగి, ఊపిరాడక చాలామంది కిందపడిపోయారు. చాలామంది వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేలుసామిపురానికి చెందిన సుగుణ (65) అనే మహిళ మరణించడంతో మృతుల సంఖ్య 41కి పెరిగింది.
ఇక, ఘటన జరిగిన వెంటనే కరూర్ చేరుకున్న సీఎం ఎం.కె. స్టాలిన్, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. భద్రతా లోపాలపై విచారణ జరిపేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరుణా జగదీశన్‌తో న్యాయ విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని నటుడు విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది "పూడ్చలేని లోటు" అని, తన హృదయం తీవ్రమైన భారంతో నిండిపోయిందని అన్నారు. మృతుల కుటుంబాలకు తనవంతుగా రూ. 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు, ప్రజల రాకను అంచనా వేయడంలో పోలీసు, నిఘా వర్గాలు విఫలమయ్యాయని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు. అధికారులు కేసు నమోదు చేసుకుని, సభల నిర్వహణలో భద్రతా ప్రమాణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com