Himachal Pradeshs: సంప్రదాయాన్ని ఇష్టపడి.. అన్నదమ్ములను పెండ్లాడిన యువతి

మహాభారతంలో ద్రౌపది లా అన్నదమ్ములు ఒకే మహిళను పెళ్లి చేసుకునే సంస్కృతి దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ సంప్రదాయంగా వస్తోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని శిల్లాయ్ గ్రామంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. శిల్లాయ్ గ్రామంలో హట్టి తెగకు చెందిన ఇద్దరు సోదరులు ఒకే వధువును వివాహం చేసుకున్నారు. ఈ పురాతన బహుభర్తృత్వం సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహం వందలాది మంది సమక్షంలో జరిగింది.
షిల్లాయ్ గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే సోదరులు, తమ సమీపంలోని కున్‌హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్‌ను ఒకేసారి ఉమ్మడిగా పెళ్లి చేసుకుని తమ జీవిత భాగస్వామిగా స్వీకరించారు. వీరందరూ హట్టి తెగకు చెందిన వారే. ఈ అంశంపై వధువు సునీతా చౌహాన్ మాట్లాడుతూ.. తాను ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. విద్యావంతులైన యువకులు ప్రదీప్, కపిల్ నేగి కూడా తమ నిర్ణయం ఎటువంటి ఒత్తిడి లేదని వెల్లడించారు. సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్-గిరి ప్రాంతంలో ఈ వివాహ వేడుకను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. జూలై 12న ప్రారంభమైన ఈ మూడు రోజుల ఉత్సవంలో ప్రజలు స్థానిక జానపద పాటలు, నృత్యాలను ఆస్వాదించారు. వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో ఉద్యోగి, కపిల్ నేగి విదేశాల్లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com