Bus Fire : ఢిల్లీ-జైపూర్ హైవేపై బస్సులో మంటలు

Bus Fire :  ఢిల్లీ-జైపూర్ హైవేపై బస్సులో మంటలు
ఇద్దరు సజీవదహనం..

ఢిల్లీ – జైపూర్ హైవేపై బస్సులో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ – జైపూర్ హైవేపై బుధవారం రాత్రి స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని గుర్గావ్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 31లోని ఫ్లైఓవర్‌పై రాత్రి 9 గంటలకు ప్యాసింజర్ బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనే కమిషనర్‌ సహా అగ్నిమాపక బృందం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఏసీపీ (క్రైమ్) వరుణ్ దహియా తెలిపారు. ఫైరింజన్లతో అగ్నిమాపక బృందం మంటలను ఆర్పివేశారని పేర్కొన్నారు.

గాయపడిన వారందరినీ రక్షించి బస్సు లోపల నుంచి బయటికి తీసుకొచ్చారని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున వారిని గుర్తించలేదు. కాగా, బస్సు గుర్గావ్ సెక్టార్ 12 నుండి ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు వెళ్తోందన్నారు.

మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ నుంచి మూడు ఫైరింజన్లు ఉపయోగించినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి రమేష్ సైనీ తెలిపారు. 1.5 గంటల పాటు ఆపరేషన్లు కొనసాగాయని, ఆ తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. చాలా సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా నిర్ధారించలేదని చెప్పారు.

రాత్రి 8.25 గంటలకు తమకు సమాచారం అందిందని, 5-7 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నామని రెస్క్యూ ఆపరేషన్స్‌లో బృందానికి నాయకత్వం వహించిన ఫైర్‌మెన్ ప్రవీణ్ ధుల్ తెలిపారు. మూడు ఫైర్ ఇంజన్లు, ఒక ప్రైవేట్ ఫైర్ ఇంజన్ లతో ఘటనాస్థలానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. బస్సు రన్నింగ్ లో ఉండగానే మంటలు చెలరేగాయని వెల్లడించారు. తాము అక్కడికి చేరుకునే సమయానికి, మంటలు చెలరేగడానికి గల కారణాల గురించి సమాచారం పొందడానికి ప్రయాణీకులెవరూ లేరని తెలిపారు. ఫ్లై ఓవర్‌పై బస్సు మంటల్లో చిక్కుకున్నట్లు చుట్టుపక్కలవారు వివరించారని తెలిపారు. జిల్లా డీసీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలు, డీసీపీలతో పాటు కనీసం 20 మంది అగ్నిమాపక అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది కూలీలు ఉన్నారని గుర్గావ్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు తమ వెంట బట్టలు, గృహోపకరణాలు, పాత్రలు, గ్యాస్ సిలిండర్‌ను తీసుకువచ్చారని తెలిపారు. క్రైమ్ బృందం ఎఫ్ఎస్ ఎల్/క్రైమ్ సీన్ కు సమాచారం అందించి సంఘటనా స్థలానికి రప్పించినట్లుగా వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story