EC: మార్చి 15లోగా ఎన్నికల కమిషనర్ల భర్తీ

EC: మార్చి 15లోగా ఎన్నికల కమిషనర్ల భర్తీ
అర్జున్ రామ్ మేఘ్ వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ... ద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనున్న ప్రధాని నేతృత్వంలోనే కమిటీ

మార్చి 15వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయగా.... సీనియారిటీపరంగా రెండోస్థానంలో ఉన్న కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి 14నే పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. రెండు ఎన్నికల కమిషనర్ల పోస్టుల కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఐదుగురేసి పేర్లతో కూడిన రెండు ప్యానళ్లను తొలుత ఎంపిక చేయనుంది. అనంతరం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ ఛౌదరితో కూడిన సెలక్షన్ కమిటీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనుంది. వారిని రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లుగా నియమించనున్నారు. సభ్యుల వీలునుబట్టి ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. మార్చి 15లోగా ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదలకానున్న వేళ ఎన్నికల కమిషనర్ల నియామకం కీలకంగా మారింది.


అసలు ఏమైందంటే..

సార్వత్రిక ఎన్నికలు ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే ఆమోద ముద్ర వేశారు. శనివారం నుంచే రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయన రాజీనామాకు కారణాలు తెలియరాలేదు. గోయెల్‌ రాజీనామాతో ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు. సీనియారిటీపరంగా రెండోస్థానంలో ఉన్న కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేసిన తర్వాత రాజీవ్‌ కుమార్‌, అరుణ్‌ గోయెల్‌ మిగిలారు. ఇప్పుడు గోయెల్‌ రాజీనామాతో ఒక్కరే మిగిలారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసే సమయంలో ఎన్నికల సంఘం ఇలా ఏకసభ్య కమిషన్‌గా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గోయెల్‌ 2022 నవంబరు 1న ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబరు వరకూ ఉంది. ఇంతలో రాజీనామా చేశారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అయిన ఆయన ఇదివరకు కేంద్ర ప్రభుత్వంలో భారీ పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story