UP: ఫుడ్ డెలివరీ ఏజెంట్ల దుస్తుల్లో వచ్చి బంగారం దుకాణంలో చోరీ

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో వచ్చి నగల షాపు దోచుకెళ్లారు. సిబ్బందిని బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లింకిట్, స్విగ్గీ డ్రస్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు ధరించి జ్యువెలరీ షాపులోకి వచ్చారు. ఒక ఉద్యోగిని నెట్టివేసి దుకాణంలోకి బలవంతంగా ప్రవేశించారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
దొంగలిద్దరూ కూడా డిస్‌ప్లేలో ఉన్న ఆభరణాలు బ్యాగ్‌లో వేసుకుని వేగంగా బైక్‌పై పారిపోయారు. నిమిషాల వ్యవధిలోనే దుకాణాన్ని ఖాళీ చేసేశారు. కేవలం ఐదు, ఆరు నిమిషాల్లోనే దోపిడీ పూర్తి చేశారు. దాదాపు 20 కిలోల వెండి, 125 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు పారిపోగానే దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దోపిడీలో షాపులో పనిచేస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందా అనే కోణంలోను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దొంగతనానికి గురైన వస్తువుల విలువ దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com