Bihar: గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు వేసి పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

సామాజిక కట్టుబాట్లకు భిన్నంగా బీహార్‌లో ఓ అరుదైన ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. సుపౌల్ జిల్లా త్రివేణిగంజ్‌లోని ఓ మాల్‌లో పనిచేస్తున్న ఇద్దరు యువతులు పరస్పర అంగీకారంతో స్వలింగ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన తమ పరిచయం ప్రేమగా మారిందని, ఇప్పుడు జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు.
ఈ నెల 23న రాత్రి త్రివేణిగంజ్‌లోని మేళా గ్రౌండ్‌లో ఉన్న ఓ ఆలయానికి చేరుకున్న ఈ యువతులు, అతికొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా అగ్నిహోత్రం చుట్టూ కాకుండా, గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమం చాలా నిరాడంబరంగా జరగడంతో విషయం వెంటనే బయటకు తెలియలేదు.
గత రెండు నెలలుగా త్రివేణిగంజ్‌లోని వార్డ్ నెం. 18లో ఓ అద్దె గదిలో ఈ ఇద్దరు యువతులు కలిసి నివసిస్తున్నారు. బుధవారం ఉదయం పెళ్లి తర్వాత వారు గదికి తిరిగిరావడంతో వారి వివాహ వార్త స్థానికంగా తెలిసింది. కొద్దిసేపటికే ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పెళ్లి చేసుకున్న వారిని మధేపురా జిల్లాకు చెందిన పూజా గుప్తా (21), శంకర్‌పూర్ ప్రాంతానికి చెందిన కాజల్ కుమారి (18)గా గుర్తించారు. ఈ వివాహంలో పూజా గుప్తా వరుడి పాత్ర పోషించగా, కాజల్ కుమారి వధువుగా నిలిచింది. తమకు పురుషులపై ఆసక్తి లేదని, తమ బంధం పూర్తిగా మానసిక అనుబంధంపై ఆధారపడిందని ఆ యువతులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

