Kotak Mahindra: సీఈవో, ఎండీ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా

Kotak Mahindra:  సీఈవో, ఎండీ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా
X
నాలుగు నెలల ముందే రాజీనామా చేసిన ఉదయ్

కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవుల నుంచి ఉదయ్ కోటక్ తప్పుకున్నారు. ఆయన సెప్టెంబర్ 1 నే తన పదవికి రాజీనామా చేయగా అది తక్షమమే అమల్లోకి వచ్చిందని బ్యాంక్, సెప్టెంబర్ 2న స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. అయితే కోటక్ ప్రస్తుతం బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో కొనసాగనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ దిగ్గజ బ్యాంకులో ఎండీ, సీఈఓగా ఉదయ్ పదవీ కాలం 2023, డిసెంబర్ 31తో ముగియాల్సి ఉండగా.. 3 నెలలు ముందుగానే పదవుల నుంచి తప్పుకున్నారు.

పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఉదయ్ కోటక్.. సామాజిక మాధ్యమాల్లో ఒక నోట్ పెట్టారు. బ్యాంక్ వారసత్వ ప్రణాళికను రూపొందించడంలో భాగంగానే ఈ పదవుల నుంచి తాను తప్పుకున్నానని, బ్యాంకులో వారసత్వమే ప్రస్తుతం తన మనస్సులో అత్యంత ముఖ్యమైన ఆలోచనగా ఉందన్నారు. తాను సహా బ్యాంక్ ఛైర్మన్, జాయిండ్ ఎండీ అంతా ఈ ఏడాది ముగిసేలోపే తప్పుకోవాల్సి ఉందని.. అందుకే స్వచ్ఛందంగా తప్పుకొని కొత్తవారికి బాధ్యతలు సాఫీగా అప్పజెప్పడమే ముఖ్యమని అన్నారు. జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి సంస్థలు ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయించటం చూశానని ఆయన తెలిపారు.దేశంలో గొప్ప ఆర్థిక సంస్థను సృష్టించాలనే కలతోనే తాను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో తాను ఈ సంస్థను ప్రారంభించినట్లు ఉదయ్‌ కోటక్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. 2023 సెప్టెంబరు 2 నాటికి ఉదయ్ కోటక్ దాదాపు 13.7 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో భారతదేశపు అత్యంత సంపన్న బ్యాంకర్. ఎకనమిక్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ఆయన ఆదాయంలో దాదాపు 26 శాతం బ్యాంకులో వాటా నుంచే వస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఉదయ్‌ కోటక్‌ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 133వ స్థానంలో ఉన్నారు.

సీఈవోగా ఉదయ్ వైదొలిగినప్పటికీ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. ఏదైనా బ్యాంకు సీఈవోగా పదిహేనేళ్లకు మించి ఉండకూడదని ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం బ్యాంకులో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దీపక్ గుప్తా.. డిసెంబర్ 31 వరకు తాత్కాలికంగా బ్యాంక్ ఎండీ, సీఈఓ పదవులు నిర్వర్తించనున్నట్లు తెలిపింది. అయితే ఇది బ్యాంక్ సభ్యుల సమ్మతి, ఆర్‌బీఐ ఆమోదానికి అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేసింది.

Tags

Next Story