MODI: అవినీతి పరులకు జైలు తప్పదన్న మోదీ

MODI: అవినీతి పరులకు జైలు తప్పదన్న మోదీ
ఉగ్రవాదులను వారి భూభాగంలోనే అంతమొందిస్తున్నట్లు ప్రకటన... తమ ప్రభుత్వం ఎన్నో రెట్లు బలంగా ఉన్నట్లు ప్రకటన

దేశంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందున ఉగ్రవాదులను వారి భూభాగంలోనే సైనికులు అంతమొందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గతంలో బలహీన ప్రభుత్వాల కారణంగా శత్రువులు లాభపడటమే కాకుండా ఉగ్రవాదం పెరిగినట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడినవారు జైలుకు వెళ్లక తప్పదని...ఇది మోదీ కీ గ్యారంటీ అని అన్నారు. పదేళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని గతంతో పోలిస్తే ఎన్నోరెట్లు బలంగా మార్చిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దేశంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు శత్రువులు లాభపడటంతోపాటు ఉగ్రవాదం విస్తరించినట్లు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌లో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ .. బలమైన బీజేపీ ప్రభుత్వం 7దశాబ్దాల తర్వాత ఎంతో ధైర్యంతో జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన 370 అధికరణను రద్దు చేసినట్లు చెప్పారు. ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకాన్ని...ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసినట్లు తెలిపారు. సుస్థిర ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలు చూస్తున్నందున ఇప్పుడు దేశమంతా ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌ అంటుందన్నారు.


ఉత్తరాఖండ్‌ తర్వాత ప్రధాని మోదీ రాజస్థాన్‌లో ప్రచారం నిర్వహించారు. కరౌలీలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న ఆయన...అవినీతిపరుల భరతం పట్టనున్నట్లు చెప్పారు. అవినీతిపరులు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని స్పష్టం చేశారు. “ గత కాంగ్రెస్‌ ప్రభుత్వ సంరక్షణలో పేపర్‌ లీక్‌ ఇండస్ట్రీ నడిచింది. మోదీ మీకు(ప్రజలకు) గ్యారంటీ ఇచ్చారు. భాజపా ప్రభుత్వం వస్తే పేపర్‌ లీక్‌ మాఫియా జైలుకు వెళ్తుందని. ఇప్పుడు కేవలం రాజస్థాన్‌లోనే కాదు దేశవ్యాప్తంగా అవినీతిపరులపై దర్యాప్తు జరుగుతోంది. అందువల్ల ఇండి కూటమి నేతలు మోదీకి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి వచ్చారు. ఒకవైపు మోదీ అవినీతిని పారదోలాలని నినదిస్తుంటే...మరోవైపు అవినీతిపరులను కాపాడాలనే వారు ఉన్నారు. వారంతా అవినీతిపరులను కాపాడేందుకు బయలుదేరారు. వారు ఒక విషయం గుర్తించుకోవాలి. మోదీని ఎన్నిరకాలుగా బెదిరించినా...అవినీతిపరులు జైలుకు వెళ్లకతప్పదు. ఇది మోదీ కీ గ్యారంటీ.” అని ప్రధాని హెచ్చరించారు.

తన జీవితంలో ప్రతి క్షణాన్ని దేశానికి అంకితం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మోదీ పుట్టింది విశ్రాంతి కోసమో లేదా వినోదం కోసమో కాదన్నారు. దేశ ప్రజలకు సంబంధించిన పెద్ద లక్ష్యాలు నెరవేరాల్చి ఉన్నందున...మోదీ నిర్వీరామంగా పని చేస్తున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story