జులై నాటికి 20 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ : కేంద్రమంత్రి హర్షవర్ధన్

జులై నాటికి 20 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ : కేంద్రమంత్రి హర్షవర్ధన్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా టీకా ప్రయోగాలు తుది దశకుచేరుకున్నాయి. వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా అందించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ చర్చలు చేపట్టింది. వచ్చే ఏడాది జులై నాటికి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా టీకా ప్రయోగాలు తుది దశకుచేరుకున్నాయి. వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా అందించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ చర్చలు చేపట్టింది. వచ్చే ఏడాది జులై నాటికి దేశంలోని 20 కోట్ల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్ అందజేయనున్నట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలియజేశారు. ఇందుకోసం 40 కోట్ల నుంచి 50 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సేకరించేందుకు సిద్దమైనట్లు వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ డోసులను పంపిణీచేయాల్సిన వైద్యసిబ్బంది సమాచారాన్ని అక్టోబర్ చివరినాటికి ఇవ్వాల్సిందిగా అన్నిరాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు. సేకరించిన వ్యాక్సిన్‌ పై సరఫరాలో విషయంలో కేంద్ర నిఘా ఏర్పాటుచేస్తుందని తెలిపారు.

కరోనా టీకా విషయంలో కేంద్రం స్పష్టత నిచ్చింది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యత ఉంటుందని కేంద్రం తెలిపింది. వైద్యులు, నర్సులు, పారామెడికల్, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, కరోనా రోగులకు పరీక్షలు చేసే సిబ్బంది, రోగుల వివరాలు సేకరించే అధికారులు ఈ తొలిప్రాధాన్య జాబితా కిందికి వస్తారని వెల్లడిచింది. వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ఈ ప్రక్రియను నీతిఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపింది. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ పక్కదోవ పట్టకుండా, బ్లాక్‌ మార్కెట్‌ దందాను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని కేంద్ర స్పష్టంచేసింది.

ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వీటి ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాతో కలిసి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ రెండు, మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. ఈ టీకాపై బ్రిటన్‌లో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం 2020 చివరి నాటికి బ్రిటన్‌లో ఈ టీకాకు అనుమతులు లభిస్తాయని, వచ్చే ఆరు నెలల్లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని సమాచారం. మరోవైపు, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ రెండో దశ ట్రయల్స్‌లో ఉండగా..... జైడస్‌ కాడిలా అభివృద్ధి చేసిన టీకా మూడో దశ ట్రయల్స్‌ జరుపుకునేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నది. వచ్చే రెండు మూడు నెలల్లో వీటి వాడకానికి క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story