Fake 500 Rupees Notes: నకిలీ రూ.500 నోట్లతో జాగ్రత్త

500 రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నకిలీ నోట్లపై ఎన్ఐఏ, డీఆర్ఐ, సీబీఐ, సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించలేకుండా ఉన్నాయని చెప్పింది. దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తో నకిలీ నోట్లు చెలామణి అయ్యే ప్రమాదం భారీగా ఉందని చెప్పింది. అలాగే ఇప్పటికే అలాంటి 500 నోట్లు సర్కులేషన్ లో ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది.
ఫేక్ కరెన్సీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రజలు కంగారు పడుతున్నారు. ఎందుకైనా మంచిదని తమ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకుంటున్నారు. అవి ఒరిజినల్ నోట్లా? నకిలీ నోట్లా? అని చూసుకుంటున్నారు.
నకిలీ 500 రూపాయల నోటును గుర్తించడం ఎలానో కేంద్ర హోంశాఖ తెలిపింది. దీనికి సంబంధించి కీలక సూచన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ (RESERVE) అనే చోట E అక్షరం బదులు A ముద్రించి ఉంటుందని వెల్లడించింది. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప 500 రూపాయల నోటుపై ఈ తప్పును అస్సలు గమనించలేరంది. ఈ నకిలీ కరెన్సీ గురించి అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. నకిలీ కరెన్సీని అంగీకరించకుండా ఉండటానికి లావాదేవీల సమయంలో నోట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రత్యేక సూచనలు చేసింది. నకిలీ 500 రూపాయల నోట్లు అత్యంత అధునాతనంగా ఉంటాయని, నిజమైన నోట్లతో పోలికను కలిగి ఉంటాయని పేర్కొంది. దీంతో నిశిత పరిశీలన లేకుండా వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పింది. నకిలీ కరెన్సీ చెలామణిలో ఉన్న నేపథ్యంలో మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. కరెన్సీ నోట్లపై స్పెల్లింగ్, భద్రతా ఫీచర్ల కోసం ఎల్లప్పుడూ తనిఖీ చేయండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com