Union Interim Budget: బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులు...

Union Interim Budget: బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులు...
ఏపీకి రూ.9,138 కోట్లు, తెలంగాణకు రూ.5,071 కోట్లు

కేంద్ర ప్రభుత్వం గురువారం మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే ప్రాజెక్టు పనుల కోసం నిధులను కేటాయించింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టుల పనుల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఇక తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే ప్రాజెక్టుల పనుల కోసం రూ.886 కోట్ల నిధులు ఇచ్చారని కేంద్రమంత్రి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేస్ కే రూ.9,138 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఏపీలో ఏడాదికి 240 కి.మీ. మేర నూతన ట్రాక్‌ పనులు జరుగుతున్నాయని,,, 98 శాతం లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తి అయినట్లు వివరించారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఇంకా భూమి అప్పగించలేదని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి అయితే పనులు ప్రారంభిస్తామన్నారు.

తెలంగాణలో వంద శాతం విద్యుదీకరణ పనులు పూర్తి అయినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణలో రైల్వే పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ ప్రయాణికుల సౌలభ్యం కోసం 40,000 రైల్వే బోగీలను వందే భారత్ ప్రమాణాలకు మారుస్తామని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మౌలిక సదుపాయాల కేటాయింపును రూ.11.11 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. మూడు ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వీటిలో ఒకటి ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్లు. రెండోది పోర్టు కనెక్టివిటీ కారిడార్లు. మూడోది అధిక ట్రాఫిక్ సాంద్రత కారిడార్లు. మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం పీఎం గతి శక్తి కింద ఈ ప్రాజెక్టులను గుర్తించారు. ఇవి లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఖర్చును తగ్గిస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో రెండు, మూడు లైన్లకు ఇవ్వనున్న నిధులు మాత్రమే ఆశాజనకంగా ఉన్నాయి. కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు 310 కోట్లు, విజయవాడ-గూడూరు మూడో లైనుకు 500 కోట్లు, గుంటూరు-గుంతకల్లు రెండో లైన్‌కు 283.50 కోట్లు, గుంటూరు-బీబీనగర్ రెండో లైన్‌కు 200 కోట్లు కేటాయించారు. కర్నూలు వ్యాగన్ మరమ్మతుల కేంద్రానికి 115 కోట్లు ఇవ్వనున్నారు.

Tags

Next Story