Suresh Gopi: తిరిగి సినిమాలు చేసుకుంటా.. సురేష్ గోపి సంచలన ప్రకటన

కేంద్ర పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి, ప్రముఖ నటుడు సురేశ్ గోపి తన మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల కన్నా సినిమాల్లో నటించడమే ఇష్టమని, తిరిగి నటన వైపు వెళ్లాలని ఉందని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ఆదాయం పూర్తిగా ఆగిపోయిందని, డబ్బు సంపాదించుకోవడానికి మళ్ళీ నటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
సోమవారం కన్నూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సురేశ్ గోపి మాట్లాడుతూ... "నేను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను. నాకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా ఆదాయం పూర్తిగా ఆగిపోయింది" అని తెలిపారు. ఎన్నికలకు ముందు రోజు కూడా తాను మంత్రి పదవి కోరుకోవడం లేదని, సినిమాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు మీడియాకు చెప్పానని గుర్తుచేశారు.
తాను మంత్రి కావాలని ఎప్పుడూ ప్రార్థించలేదని సురేశ్ గోపి పేర్కొన్నారు. పార్టీలో తానే చిన్నవాడినని, తన స్థానంలో రాజ్యసభ ఎంపీ సి. సదానందన్ మాస్టర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. "ప్రజలు ఎన్నుకున్న మొదటి ఎంపీని కాబట్టి, పార్టీ నన్ను మంత్రిని చేయాలని భావించింది" అని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా, కొందరు తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని సురేశ్ గోపి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన త్రిశూర్ ప్రజలను ఉద్దేశించి తాను ‘ప్రజ’ అనే పదాన్ని వాడటాన్ని కొందరు విమర్శించారని ఆయన గుర్తుచేశారు. "ఒకప్పుడు పారిశుధ్య కార్మికులను వేరే పేరుతో పిలిచేవారు, ఇప్పుడు వారిని 'శానిటేషన్ ఇంజనీర్లు' అంటున్నారు. అలాగే నేను 'ప్రజ', 'ప్రజాతంత్రం' వంటి పదాలు వాడితే తప్పేంటి?" అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థులు తన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com