Dhoti Cricket: ధోతీలతో క్రికెట్ టోర్నీ..

Dhoti Cricket: ధోతీలతో క్రికెట్ టోర్నీ..
గెలిచిన జట్టుకు అయోధ్య దర్శనం

మధ్యప్రదేశ్‌లో వినూత్న రీతిలో క్రికెట్ టోర్నీ జరిగింది. ఆటగాళ్లంతా సంప్రదాయ దుస్తులు ధరించి క్రికెట్ ఆడారు. ధోతీ కుర్తా, లుంగీలు ధరించి వీక్షకులను అలరించారు. మ్యాచ్‌కు తగ్గట్టు కామెంటరీ సైతం వినూత్నంగానే సాగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

మధ్యప్రదేశ్‌లో సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడానికి వినూత్న రీతిలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ టోర్నీలో వేద బ్రాహ్మణులు సంప్రదాయ దుస్తులైన ధోతి, కుర్తా, పంచలు ధరించి క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొన్నారు. భోపాల్‌కు చెందిన మహర్షి మైత్రి మ్యాచ్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆటగాళ్లు ఉత్సహంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంటరీ సైతం వినూత్నంగానే సాగింది. సంస్కృతంలో కామెంటరీ చెప్పించిన నిర్వాహకులు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.


మొత్తం 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. గెలుపొందిన టీమ్‌కు బంపర్ ఆఫర్‌ను సైతం ప్రకటించారు. విజేతగా నిలిచిన జట్టు సభ్యులను అయోధ్య రాముడి దర్శనానికి తీసుకెళ్తామని చెప్పారు. మన సంస్కృతికి ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన వ్యక్తికి శతాబ్ది పంచాంగం పుస్తకాన్ని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనవారికి భగవద్గీత, పురాణ, ఇతిహాస పుస్తకాలు ఇస్తామని నిర్వాహక కమిటీ ఛైర్మన్ అభిషేక్ దుబె తెలిపారు.

అంతేకాకుండా విజేత‌ల‌కు రూ.21వేలు, ర‌న్న‌ర‌ప్‌కు రూ.11వేల న‌గ‌దు ప్రోత్స‌హ‌కాన్ని అందించ‌నున్నారు. ఇది నాలుగో ఎడిష‌న్ టోర్న‌మెంట్ అని భోపాల్‌కు చెందిన నాలుగు జ‌ట్ల‌తో క‌లిపి మొత్తం 12 జ‌ట్లు ఈ టోర్న‌మెంట్‌లో పాల్గొన్న‌ట్లు వివ‌రించారు. మ‌రో నిర్వాహ‌కుడు మాట్లాడుతూ.. వైదిక కుటుంబంలో సంస్కృతం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమ‌ని చెప్పారు. బహుమతులు కాకుండా, క్రీడాకారుల‌కు వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగాన్ని అందివ‌నున్న‌ట్లు తెలిపారు.

Tags

Next Story