బెంగళూరు నగరాన్ని ముంచెత్తిన అకాల వర్షం

బెంగళూరు నగరాన్ని అకాల వర్షం ముంచెత్తింది. భారీ ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. భారీగా గాలులు వీయడం వల్ల పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కేఆర్ సర్కిల్ అండర్‌పాస్‌లో కారు చిక్కుకొని ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయారు. కుమారకృప రోడ్డు మార్గంలో చెట్టు విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. చిత్రకళాపరిషత్ ఎదుట ఓ చెట్టు కుప్పకూలింది. దీంతో ఓ కారు, బైకు ధ్వంసమయ్యాయి.
భారీ వర్షానికి కేఆర్ సర్కిల్ వద్ద అండర్‌పాస్‌లోకి పెద్దమొత్తంలో వరద నీరు చేరడంతో ఓ కారు చిక్కుకుపోయింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తుండగా.. స్థానికులు నలుగురిని బయటకి తీశారు. అందులో భానురేఖ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మిగతా ఇద్దరిని అతికష్టం మీద బయటకు తీశారు. వీరంతా ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. విహారయాత్ర కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
అకాల వర్షాలపై సీఎం సిద్ధరామయ్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు బానురేఖ చికిత్స పొందిన ఆస్పత్రిని సిద్ధరామయ్య సందర్శించారు. మృతురాలి కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com