తాళి కట్టాల్సినవాడిని చెట్టుకి కట్టేసారు.. ఎందుకంటే

తాళి కట్టాల్సినవాడిని చెట్టుకి కట్టేసారు.. ఎందుకంటే
వధువు మెడలో జయమాల వేసేందుకు అదనపు కట్నం డిమాండ్

మరి కాసేపట్లో పెళ్లికూతురు మెడలో తాళి కట్టి ఒక ఇంటివాడు అవ్వచ్చు. సంతోషంగా కుటుంబ జీవితం గడపచ్చు. కానీ కరెక్ట్ గా టైం లోనే వరుడికి తిక్క పుట్టింది. పెళ్లి మండపాన్ని చక్కగా ముస్తాబు చేశారు. బంధువులంతా వచ్చేసారు. అంతా ఓకే అనుకుంటుండగా అప్పుడు అడిగాడు అదనపు కట్నం. ఇస్తామన్న కట్నం కంటే అదనంగా ఇస్తేనే వధువు మెడలో జయమాల్ల వేస్తానని భీష్మించుకొని కూర్చున్నాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులకు చిర్రెత్తుకువచ్చింది.

అడిగి, బతిమాలి విసిగిపోయిన వధువు తరపు బంధువులు పెళ్ళికొడుకు, అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితక్కొట్టేశారు. తాళి కట్టాల్సినవాడు కాస్తా చెట్టుకు కట్టివేయబడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ప్రతాప్‌గడ్‌లోని మంధాతా కొత్వాలి ప్రాంతానికి చెందిన యువకుడు, యువతికి పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయించారు. పెళ్లి వేడుక కోసం పెళ్ళికొడుకు ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. కొద్ది క్షణాలు గడిస్తే వధువు మెడలో జయమాల వేయాల్సి ఉంది. అప్పుడు ఉన్నట్టుండి పెళ్ళికొడుకు తనకు అదనపు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. ఇందుకు అంగీకారం తెలిపితేనే వధువు మెడలో జయమాల వేస్తానని చెప్పాడు.

దీంతో అతడికి వధువు తరపు వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంత బతిమిలాడినా అతడి తీరు మారలేదు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతడికే మద్దతుగా నిలిచారు. వరుడి స్నేహితులు కూడా రెచ్చిపోయి పద్దతి లేకుండా అసభ్యంగా నడచుకున్నారు. ఎంత నచ్చజెప్పినా వరుడి తరపువారు వినకపోవడంతో వధువు తరపు కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. పెళ్ళికొడుకు, అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితకబాదారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులే పెద్దలుగా పంచాయతీ పెట్టినా ఫలితం లేకపోయింది. పెళ్ళికి ఎవరూ సుముఖంగా లేరని చెబుతున్న పోలీసులు వారు డైరెక్ట్ గా కేసు కూడా పెట్టలేదని. ఇరు కుటుంబాలు వాదులాడుకోవడం తప్ప వివాహం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story