UP Constables : రోడ్డెక్కిన యూపీ కానిస్టేబుల్.. ఎందుకంటే..?

UP Constables : రోడ్డెక్కిన యూపీ కానిస్టేబుల్.. ఎందుకంటే..?
UP Constables : ఇన్నాళ్లూ సహించారు.. భరించారు.. ఇప్పుడా సహనం నశించి రోడ్డెక్కుతున్నారు.

UP Constables : ఇన్నాళ్లూ సహించారు.. భరించారు.. ఇప్పుడా సహనం నశించి రోడ్డెక్కుతున్నారు. యూపీలో కానిస్టేబుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది.. డ్యూటీల సంగతి ఎలా ఉన్నా, మెస్‌లో పెట్టే ఆహారం అత్యంత దారుణంగా ఉండటంతో కన్నీళ్లతో తాము పడే కష్టాలను చెప్పుకుంటున్నారు..

యూపీలోని ఫిరోజాబాద్‌ పోలీస్‌ మెస్‌లో తమకు అందించే ఆహారం పశువులు కూడా తినవంటూ ఓ కానిస్టేబుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.. కోర్టు వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న మనోజ్‌ కుమార్‌ భోజనం ప్లేటుతో రోడ్డు మీదకు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు.. ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు ఆందోళనకు దిగిన కానిస్టేబుల్‌నే అరెస్టు చేయడం యూపీలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఫిరోజాబాద్‌లో మనోజ్ కుమార్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి పోలీసుల మెస్‌లోనే భోజనం చేసేవాడు. అక్కడి ఫుడ్​బాగా లేకపోవడంతో రోజూ పై అధికారులకు కంప్లైంట్ చేసేవాడు. అయినా వారి తీరు మారకపోవడంతో నిరసనకు దిగాడు. రోటీలు, పప్పు, అన్నం వడ్డించిన ప్లేట్​చేతిలో పట్టుకుని తన ఆవేదన వెలిబుచ్చాడు.. క్వాలిటీ లేని ఈ ఫుడ్డు తిని పోలీసులు కఠినమైన డ్యూటీలు ఎలా చేస్తారని ప్రశ్నించాడు. కానిస్టేబుల్‌ రోడ్డెక్కడంతో చుట్టుపక్కల వారు ఏం జరిగిందోనని అక్కడ గుమిగూడారు.. అక్కడే ఉన్న కొందరు దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది.

దీంతో కానిస్టేబుల్‌ను శాంతింపజేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ఓ సీనియర్‌ అధికారి ప్రయత్నించారు. కానీ, మనోజ్‌ కుమార్‌ ఆగకుండా పరిస్థితిని కళ్లకు కట్టేలా పెద్ద పెద్దగా అరిచాడు.. ఆహారం బాగోలేదని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఫిర్యాదు చేసినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించారని భోరున విలపించాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.. ఆ విచారణ ఫుడ్‌ మీద కాదు.. మనోజ్‌ కుమార్‌ మీద.. క్రమశిక్షణా రాహిత్యం, విధులకు గైర్హాజరు సహా మనోజ్‌పై మొత్తం 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటి సంగతి కూడా తేల్చాలని సీఐని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆగమేఘాల మీద అక్కడికొచ్చిన పోలీసు అధికారులు ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story