UP Ghaziabad: యూపీలో మొబైల్ స్నాచర్ ఎన్ కౌంటర్

మొబైల్ దొంగతనం చేసే క్రమంలో బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్ మరణానికి కారణమైన రెండో నిందితుడు తాజాగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మృతుని పేరు జితేంద్ర కాగా అతనిపై ఇప్పటికే 12 కేసులు ఉన్నాయి.
యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ లో ఈ నెల 27న ఇద్దరు మొబైల్ స్నాచర్లు దారుణానికి పాల్పడ్డారు. ఆటోలో వెళుతున్న బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్ ను బైక్ పై వెంబడించారు. ఆటో పక్కగా బైక్ స్లో చేసి కీర్తి చేతిలోని మొబైల్ లాక్కోవడం మొదలుపెట్టాడు. కీర్తి తన మొబైల్‌ని వదలకుండా తీవ్రంగా ప్రతిఘటించింది . దీంతో నిందితులు ఆమె చేయి పట్టుకొని బయటకు లాగారు. కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఆపై మొబైల్ లాక్కుని పారిపోయారు. రన్నింగ్ ఆటో నుంచి కిందపడడంతో గాయాలపాలైన కీర్తిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె శరీరంపై , తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కీర్తి మృతి చెందింది.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన తర్వాత ముస్సోరి పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన రవీంద్ర చంద్ర పంత్‌ను సస్పెండ్ చేయగా, ఈ పోలీస్ స్టేషన్‌లో నియమించబడిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను అక్కడి నుండి తొలగించారు. మొబైల్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగలను గుర్తించిన పోలీసులు.. వారికోసం వేట ప్రారంభించారు. ఒక నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించి రెండో నిందితుడు జితూ కోసం తీవ్రంగా గాలించారు. ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జితూ ఉన్నాడనే సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నంలో జితూ గంగానాహర్ ట్రాక్ పై పరుగులు పెట్టాడు. పోలీసుల పై దాడికి ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరపడంతో జితూ గాయపడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జితూ చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు కూడా గాయపడ్డాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com