UP: వరకట్న దాహానికి మరో మహిళ బలి..

UP: వరకట్న దాహానికి మరో మహిళ బలి..
X
భార్యను చంపిన కానిస్టేబుల్

ఈ మధ్య వరకట్న పిశాచి దేశాన్ని వెంటాడుతోంది. రోజూ ఎక్కడొక చోట వరకట్న దాహానికి అబల బలైపోతుంది. ఇటీవలే నోయిడాలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే రాజస్థాన్‌లో మూడేళ్ల కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం అయ్యారు. తాజాగా ఇదే తరహాలో యూపీలో మరో అబల ప్రాణాలు కోల్పోయింది.

దేవేంద్ర-పరుల్(32) భార్యాభర్తలు. దేవేంద్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పరుల్ నర్సు శిక్షణ పొందింది. ఇటీవలే రాంపూర్ నుంచి బరేలీకి దేవేంద్ర బదిలీ అయ్యాడు. అయితే అదనపు కట్నం తీసుకురావాలంటూ పరుల్‌ను దేవేంద్ర హింసిస్తున్నాడు. సెలవుపై ప్రస్తుతం దేవేంద్ర ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే నారంగ్‌పూర్ గ్రామంలో ఉండగా మళ్లీ కట్నం కోసం గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పరుల్‌‌కు దేవేంద్ర, బంధువులు నిప్పంటించారు. దీంతో తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీకి తరలించారు. చికిత్స పొందుతూ పరుల్ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అమ్రోహా జిల్లా పోలీసులు ఆరుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దేవేంద్ర సహా కుటుంబ సభ్యులపై కేసు బుక్ చేశారు.

కట్నం డిమాండ్ తీర్చకపోవడంతో దేవేంద్ర, అతడి బంధువులు పరుల్‌ను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. పరుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు భర్త దేవేంద్ర, అతని తల్లి, సోను, గజేష్, జితేంద్ర, సంతోష్ అనే నలుగురు మగ బంధువులపై గృహ హింస, హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరుగురు నిందితులంతా పరారీలో ఉన్నారని.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

మంగళవారం తెల్లవారుజామున పొరుగువారు తమకు ఫోన్ చేసి చెప్పారని పరుల్ తల్లి అనిత తెలిపింది. కుమార్తె దగ్గరకు రాగానే నొప్పితో విలవిలలాడుతోందని చెప్పింది. తీవ్రగాయాలతోనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని.. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రాణాలతో పోరాడుతో ప్రాణాలు కోల్పోయిందని కన్నీరు మున్నీరు అయింది. 13 ఏళ్ల క్రితం దేవేంద్రకు ఇచ్చి వివాహం చేశామని.. ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని చెప్పింది.

Tags

Next Story