Submarine Attack: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా, 87 మంది సిబ్బంది మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన ఐఆర్‌ఐఎస్ దేనా (ఐఆర్ఐఎస్ దేనా) అనే యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి టార్పెడోతో దాడి చేసి ముంచివేసింది. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నావికా సిబ్బంది మరణించగా, మరో 32 మందిని రక్షించారు. ఈ దాడికి తామే బాధ్యులమని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ప్రకటించడమే కాకుండా, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.
ఇరాన్ నౌక నుంచి అందిన అత్యవసర సమాచారంతో శ్రీలంక నౌకాదళం రంగంలోకి దిగింది. గాలింపు చర్యలు చేపట్టగా, ఘటనా స్థలంలో నౌక పూర్తిగా మునిగిపోయిందని, కేవలం ఆయిల్ మరకలు, లైఫ్ జాకెట్లు మాత్రమే కనిపించాయని శ్రీలంక నౌకాదళం వెల్లడించింది. నీటిలో తేలియాడుతున్న సిబ్బందిని గుర్తించి 32 మందిని రక్షించామని, 87 మృతదేహాలను వెలికితీశామని తెలిపింది. రక్షించిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో కొంతమందికి అత్యవసర చికిత్స అవసరమైందని వెల్లడించింది. కాగా, ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
మన దేశం నుంచే..
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, ఆ తర్వాత జరిగిన మిలాన్, హిందూ మహా సముద్ర నౌకాదళ సింపోజియంలలో పాల్గొనేందుకు ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా-75 విశాఖపట్నానికి ఫిబ్రవరి 17న వచ్చింది. ఈ మూడు కార్యక్రమాల్లో ఇరాన్ నౌకాదళ ప్రధానాధికారి షహ్రామ్ ఇరానీ పాల్గొన్నారు. భారత నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠితో కలిసి సమీక్షలకు హాజరయ్యారు. ఇరాన్‌కు చెందిన కమాండర్ షేకతి నేతృత్వంలో నౌకా బృందం సిటీ పరేడ్‌లో పాల్గొంది.
ఆధునిక డిస్ట్రాయర్ దేనా 75
ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన యుద్ధ నౌకల్లో ఐరిస్ దేనా-75 ఒకటి. సుదీర్ఘ సముద్ర ప్రయాణాలకు అనుకూలంగా 1500 టన్నుల బరువుతో దీనిని తయారు చేశారు. మౌడ్జ్ తరగతికి చెందిన ఈ ఫ్రిగేట్‌ను 2021లో జలాల్లో ప్రవేశపెట్టారు. 300 కి.మీ. పరిధిలో 360 డిగ్రీలను కవర్ చేసే అధునాతన రాడార్ వ్యవస్థను ఇది కలిగి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


