Marko Rubio: మా సాయం అవసరం లేదు, భారత్ చూస్కుంటుంది': ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై మార్కో రూబియో

Marko Rubio: మా సాయం అవసరం లేదు, భారత్  చూస్కుంటుంది: ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై మార్కో రూబియో
X
అసాధారణ వృత్తి నైపుణ్యం అంటూ కితాబు

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న వేళ.. అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా భారత భద్రతా దర్యాప్తు సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ.. అమెరికా సెనేటర్ మార్కో రూబియో ఎవరూ ఊహించని కామెంట్లు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు తమ సహాయం భారత్‌కు అవసరం లేదని స్పష్టం చేశారు. కెనడాలో బుధవారం జరిగిన జీ7 (G7) విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం మార్కో రూబియో విలేకరులతో మాట్లాడారు. ఎర్రకోట వద్ద పేలుడుపై దర్యాప్తునకు సాయం చేసేందుకు అమెరికా ముందుకు వచ్చినప్పటికీ.. భారత అధికారుల అసాధారణమైన వృత్తి నైపుణ్యం కారణంగా తమ అవసరం వారికి లేదని రూబియో వ్యాఖ్యానించారు.

జీ7లో జైశంకర్, రూబియో భేటీ..

జీ7 సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్, సెనేటర్ మార్కో రూబియో ద్వైపాక్షికంగా భేటీ అయ్యారు. ఈక్రమంలోనే వీరిద్దరూ అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పేలుడు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. రూబియోతో జరిగిన భేటీ గురించి జైశంకర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు కూడా పెట్టారు. ప్రపంచ సమస్యలపై వారి చర్చలను ప్రస్తావించారు.

అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పందన..

అలాగే ఢిల్లీలో జరిగిన ఈ పేలుడు ఘటనపై అమెరికా రాయబార కార్యాలయం కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Tags

Next Story