Groom kissing Bride: పెళ్లి వేడుకలో వధువుకు ముద్దు ఇచ్చిన వరుడు..

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్, అశోక్ నగర్‌లో వివాహ వేదిక యుద్ధ క్షేత్రంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెండ్లిలో వధూవరులు వర మాలలను వేసుకునే సమయంలో, వధువును వరుడు ముద్దాడాడు. దీన్ని చూసిన వధువు బంధువులు ఆగ్రహంతో వరుని బంధువులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కర్రలతో వివాహ వేదికపైకి ఎక్కి, వరుని బంధువులపై దాడి చేశారు.
వధువు తండ్రితోపాటు ఆరుగురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి, ఇరు కుటుంబాలకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని స్థానిక దవాఖానకు తరలించారు. వధువు తండ్రి తన ఇద్దరు కుమార్తెలకు సోమవారం రాత్రి పెండ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. మొదటి కుమార్తె వివాహం ప్రశాంతంగా జరిగింది. కానీ రెండో కుమార్తె వివాహం సమయంలో ఈ ఘర్షణ జరిగింది. అయితే, తమ కుమార్తెకు ఇష్టం లేకపోయినా అందరి ముందూ ముద్దు పెట్టాడని వధువు కుటుంబసభ్యులు ఆరోపించారు. వధువు అనుమతి తీసుకున్నాకే ముద్దు పెట్టానని వరుడు చెప్పాడు. అయితే, ఈ ఘటనపై తమకు రాత పూర్వకంగా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. బహిరంగంగా దాడులకు దిగిన వారిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com