Char Dham Yatra : చార్‌ధామ్‌ యాత్ర.. వీఐపీ దర్శనాలు బంద్‌

Char Dham Yatra :  చార్‌ధామ్‌ యాత్ర.. వీఐపీ దర్శనాలు బంద్‌
X
రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని స్పష్టం చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతున్నది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావొద్దని సూచించింది. చార్‌ధామ్‌కు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాధా రాతురి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయాల 50 మీటర్ల పరిధిలో ఎలాంటి వీడియోలు తీయడం గానీ, రీల్స్‌ చేయడం వంటివాటిపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. చార్‌ధాయ్‌ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన విషయం తెలిసిందే.

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ఈ యాత్రకు భక్తులు పోటెత్తుతుండటంతో రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గంగోత్రి, యమునోత్రిలకు రావాలనుకునే భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్‌ తేదీ కన్నా ముందుగా ప్రయాణం పెట్టుకోవద్దని కోరింది. ఈ వివరాలను సీనియర్‌ పోలీసు అధికారి అర్పణ్‌ యదువంశి ఓ ట్వీట్‌ ద్వారా తెలిపారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధ రాటూరి మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్‌ చేయించుకోని భక్తులను యాత్రకు అనుమతించబోమని, ఈ విషయాన్ని తెలియజేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలను పంపిస్తున్నామని చెప్పారు. యాత్ర మార్గాల్లో పోలీసులు చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి, తనిఖీలు చేస్తారన్నారు.


రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వాహనాల ప్రవేశానికి అనుమతి లేదని వివరించారు. ఈ పవిత్ర పుణ్య క్షేత్రాలలో 200 మీటర్ల పరిధిలో మొబైల్‌ ఫోన్లను వాడేందుకు అనుమతి లేదని, చార్‌ధామ్‌ యాత్ర గురించి తప్పుదోవ పట్టించే వీడియోలు, రీల్స్‌ అప్‌లోడ్‌ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గర్వాల్‌ కమిషన్‌ వినయ్‌ శంకర్‌ పాండే మాట్లాడుతూ, చార్‌ధామ్‌ యాత్రలో పాల్గొనే భక్తులు తమ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను పారదర్శకంగా తెలియజేయాలని చెప్పారు. సమగ్రమైన ఆరోగ్య పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈ నాలుగు దేవాలయాలు అత్యధిక ఎత్తులో ఉన్నాయని, వేడి వాతావరణం గల ప్రాంతాల నుంచి వచ్చేవారికి సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. ఈ యాత్రలో వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

Tags

Next Story