నచ్చిన వాడితో ఉంటానన్న భార్య అనుమతించిన కోర్టు

నచ్చిన వాడితో ఉంటానన్న భార్య అనుమతించిన కోర్టు
కట్టుకున్నవాడిని, పిల్లల్ని వదిలి సహజీవన భాగస్వామితో వెళ్ళిపోయిన మహిళ.

ఆమెకు పెళ్లయింది. పదేళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు కూడా ఉన్నారు. అయినా సరే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఇప్పుడు ఆ కుటుంబం మొత్తాన్ని వార్తల్లోకెక్కేలా చేసింది. భర్త ఉండగానే భార్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న సంఘటన తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టులో విచారణకు వచ్చింది. డెహ్రాడూన్ నగరానికి చెందిన జిమ్ ట్రైనర్ తన భార్య కనబడకుండా పోయిందని, తనను, పిల్లలను డెహ్రాడున్ లోనే వదిలేసి, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఫరీదాబాద్ కు చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తోందంటూ ఉత్తరాఖండ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో సదరు వివాహితను హైకోర్టు ముందు హాజరు పర్చాలని జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ డెహ్రాడూన్, ఫరీదాబాద్‌లోని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. దీంతో ఆ మహిళ హైకోర్టుకు వచ్చి తన ఇష్టానుసారమే తాను ఫరీదాబాద్‌ లివింగ్ పార్ట్‌నరుతోఉంటున్నానని స్పష్టం చేసింది. జిమ్ ట్రైనర్ అయిన తన భర్త తనతో అనుచితంగా ప్రవర్తించేవాడని, అందుకే ఇప్పుడు అతడితో కలిసి జీవించడం ఇష్టం లేదని కోర్టుకు తెలిపింది. తాను పూర్తి ఇష్టం తోనే వేరే వ్యక్తితో వెళ్లానని ఆ 37 ఏళ్ల మహిళ హైకోర్టుకు తెలిపింది.

2022వ సంవత్సరం ఆగస్టు 7వతేదీన తాను భర్త, పిల్లల్ని విడిచిపెట్టి, ఫరీదాబాద్ వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నానని చెప్పింది. దీంతో భర్తను వదిలి తనకు ఇష్టమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఆమెకు అనుమతినిచ్చింది.భర్త తరఫున పిటిషన్ దాఖలు చేసిన అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి తీర్పు వివాహ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భర్త ఉండగానే మరో వ్యక్తితో సహజీవనం చేసేందుకు హైకోర్టు అనుమంతించిన ఘటన సంచలనం రేపింది.

Tags

Read MoreRead Less
Next Story