Uttarkashi tunnel rescue : చివరి దశకు చేరుకున్నరెస్క్యూ ఆపరేషన్‌

Uttarkashi tunnel rescue : చివరి దశకు చేరుకున్నరెస్క్యూ ఆపరేషన్‌
కార్మికులు మరికొద్దిసేపట్లో బయటకు…

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులు ఏ క్షణంలోనైనా బయటకు రావొచ్చని అధికార వర్గాల సమాచారం. రెస్క్యూ పనులు తుది దశకు చేరుకున్నాయని, టన్నెల్ కు సమాంతరంగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు చివరకు వచ్చాయని అధికారులు చెప్పారు. వాస్తవానికి ఈ రోజు (గురువారం) ఉదయమే కార్మికులను బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. అయితే, డ్రిల్లింగ్ పనుల చివరి దశలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయని, చివర్లో ఇనుప రాడ్లు బయటపడడంతో పనులు నెమ్మదించాయని వివరించారు. సొరంగంలోని కార్మికులను తరలించేందుకు వీలుగా ప్రస్తుతం సొరంగం వెలుపల అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ఉత్తరకాశీ జిల్లాలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంతో అందులో కార్మికులు చిక్కుకున్నారు.

రెస్క్యూ పనిని వేగవంతం చేయడానికి ఢిల్లీ నుంచి ఏడుగురు నిపుణుల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. సమాంతర డ్రిల్లింగ్ ద్వారా 44 మీటర్ల పైపులను శిథిలాల్లోకి చొప్పించారు. తమ రెస్క్యూ బృందం మరికొద్దిసేపటిలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వద్దకు చేరుకుంటుందని రెస్క్యూ అధికారి హర్పాల్ సింగ్ చెప్పారు. సొరంగం వద్ద సహాయ చర్యలు చివరి దశకు చేరుకున్నాయని ఉత్తర కాశీ జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ రుహేలా చెప్పారు.


అంతకుముందు రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడారు. చిక్కుకుపోయిన కార్మికులకు అందించిన ఆహారం, నిత్యావసరాలు,మందుల గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు.

బయటకు తీశాక కార్మికులకు చికిత్స అందించేందుకు చిన్యాలిసౌర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అంబులెన్స్, వైద్యుల బృందం కూడా సిద్ధంగా ఉంచారు. ఇక్కడ కార్మికుల కోసం 41 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. సొరంగంలో కార్మికులకు విద్యుత్, మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం ఆక్సిజన్ సిలిండర్‌లను కూడా సొరంగంలోకి తీసుకువెళ్లింది.

Tags

Read MoreRead Less
Next Story