వందేభారత్ యాక్సిడెంట్.. ఆవు ఎగిరి వృద్ధుడి మీద పడడంతో..

సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ అల్వార్ నగరంలోని కాలీ మోరీ గేట్ సమీపంలో ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న రైలుకు ఆవు ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడంతో ఆవు ఎగిరి అటుగా వెళుతున్న ఓ వృద్ధుడి మీద పడడంతో ఆవుతో పాటు అతడు కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది. అల్వార్ నగరంలోని కలి మోరీ గేట్ దగ్గర వందే భారత్ రైలు వెళుతోంది. ట్రాక్ మీదున్న ఆవును ఢీకొట్టడంతో, ఆ ఆవు దూకి సుమారు 30 మీటర్ల దూరంలో నిలబడి ఉన్న హీరా బాస్ నివాసి శివదయాళ్ శర్మ(83) మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివదయాళ్ శర్మ ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు బుధవారం ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శివదయాళ్ శర్మ 23 సంవత్సరాల క్రితం రైల్వేలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com