Vande Bharat Sleeper: 180 KMPH వేగంతో వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు.. అయినా తొణకని నీళ్ల గ్లాసులు

భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు తన సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. రాజస్థాన్‌లోని కోటా - నాగ్డా సెక్షన్ల మధ్య నిర్వహించిన హై స్పీడ్ ట్రయల్స్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. కేవలం వేగాన్నే కాకుండా.. రైలు ప్రయాణంలో ఉండే స్థిరత్వాన్ని నిరూపించడానికి రైల్వే శాఖ వాటర్ టెస్ట్ నిర్వహించింది. దానికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వందే భారత్ స్లీపర్ రైలు తన గరిష్ట వేగం వద్ద ప్రయాణిస్తున్న సమయంలో కూడా దాని లోపల ఉంచిన నీటి గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వందే భారత్ స్లీపర్ కొత్త తరం టెక్నాలజీకి ఇదే నిదర్శనమని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రయాణికులు నిద్రించే సమయంలో ఎలాంటి కుదుపులు లేకుండా.. అత్యంత ప్రశాంతమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్లీపర్ రైలు వెర్షన్‌ను రూపొందించినట్లు తెలిపారు.
ప్రత్యేకతలు..
వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రైలు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది. వందే భారత్ స్లీపర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.
వందేభారత్ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ. స్పీడ్‌తో వెళ్లేలా తయారుచేశారు. దాంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనున్నది. రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి. అలాగే, రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత డిస్‌ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు వంటి సౌకర్యాలు ఈ మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నది.
టాయిలెట్‌లో ఎలాంటి బటన్ నొక్కకుండానే నీళ్లు వస్తాయి. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ సైతం ఉంటుంది. ప్రతి కోచ్‌లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రతి బెర్త్ వద్ద సాకెట్ ఉంటుంది. అలాగే, బెర్త్ వద్ద చిన్న లైట్ సైతం ఉంటుంది. దాంతో ఎవరైనా బుక్‌లు, పేపర్ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. సేఫ్టీ ‘కవచ్’ సిస్టమ్, బ్లాట్ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య దాదాపు 16-20 మధ్య ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

