Namo Bharat Rapid Rail: వందే మెట్రో కాదు ఇక నమో భారత్
మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో రైలు పేరు మారింది. ఇక నుంచి దానిని నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా పిలవనున్నారు. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీసు ఈరోజు (సెప్టెంబర్ 16) ప్రధాని మోదీ చేతుల మీదుగా గుజరాత్‌లో ప్రారంభం కానున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.
దేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుపరుగులు పెడుతున్నాయి. అమృత్ భారత్ రైలూ అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు నుంచి ఈ వందే మెట్రో పట్టాలెక్కనుంది. వందే మెట్రోఅనేది పూర్తి అన్‌రిజర్వ్‌డ్ ఎయిర్ కండీషన్‌తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే వెల్లడించింది. అహ్మదాబాద్- భుజ్‌ల మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగుతుందని తెలిపింది. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని చెప్పింది. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది.
ప్రతి రోజూ ఉదయం భుజ్‌లో 5.05 గంటలకు ప్రారంభమై అహ్మదాబాద్ జంక్షన్‌కు 10.50 గంటలకు చేరుకుంటుందని పశ్చిమ రైల్వే(అహ్మదాబాద్) పీఆర్‌ఓ ప్రదీప్‌శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు కొన్ని నిమిషాల ముందే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కొచ్చని తెలిపారు. వందేభారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్‌లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. కనీస టికెట్ ధర రూ.30గా నిర్ణయించినట్లు తెలిసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com