Varun Gandhi: కాంగ్రెస్‌లోకి వరుణ్ గాంధీ?

కేంద్ర ప్రభుత్వం, యూపీ సర్కారుపై విమర్శలు గుప్పించిన వరుణ్ గాంధీకి భాజపా టికెట్ నిరాకరించగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికింది. వరుణ్ గాంధీ విద్యావంతుడనీ ఆయనపై అవినీతి ఆరోపణలు లేవని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ ఛౌదరీ వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి వస్తే సంతోషిస్తామన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ నుంచి వరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలురాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానంతో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న పీలీభీత్ స్థానంలో ఈసారి జితిన్ ప్రసాదను భాజపా నిలబెట్టింది. కేంద్రం, యూపీ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై వరుణ్ గాంధీ విమర్శలు చేయడంతోనే ఆయనకు టికెట్ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరుణ్ గాంధీని పార్టీలోకి ఆహ్వానిస్తూ పావులు కదుపుతోంది.
కొంతకాలంగా భాజపా కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల తీరుపై వరుణ్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం... ఆసక్తికర చర్చకు దారితీసింది. భాజపాకు దూరంగా ఉంటున్న వరుణ్ గాంధీ పార్టీ మారే అవకాశం ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు కమలదళంలో టికెట్ దక్కకపోవడంతో మరోసారి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. వరుణ్‌గాంధీ తల్లి మేనకా గాంధీని మాత్రం యూపీలోని సుల్తాన్‌పుర్ నుంచి భాజపా మరోసారి బరిలోకి దించింది. వరుణ్‌కు భాజపా టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఆహ్వానించింది. వరుణ్ తమ పార్టీలోకి వస్తే సంతోషిస్తామని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ ఛౌదరీ వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలైన మేనకాగాంధీ.. ఆమెతో విబేధించి వేరుపడిన సంగతి తెలిసిందే. 2004 నుంచి మేనకాగాంధీతో పాటు ఆమె కుమారుడు వరుణ్‌గాంధీ భాజపాలో కొనసాగుతున్నారు. 2009లో పీలీబీత్ నుంచి, 2014లో సుల్తాన్‌పుర్ నుంచి, 2019లో మళ్లీ పీలీభీత్ నుంచి వరుణ్‌గాంధీ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. భాజపా టికెట్ నిరాకరించడంతో వరుణ్‌గాంధీని తమ పార్టీలో చేర్చుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ కూడా యత్నిస్తున్నట్లు సమాచారం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com