Venkaiah Naidu: దక్షిణాదిపై బీజేపీ ఫోకస్‌.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?

Venkaiah Naidu: దక్షిణాదిపై బీజేపీ ఫోకస్‌.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?
Venkaiah Naidu: ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పాలిటిక్స్‌తో మరోసారి హస్తిన రాజకీయాలు వేడెక్కాయి.

Venkaiah Naidu: ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పాలిటిక్స్‌తో మరోసారి హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. విపక్షాల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కేంద్రమాజీ మంత్రి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి రేసులో దిగుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఎన్టీయే తరపు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు నిలుస్తారనేది సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ నాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది.

రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యోగా డే కోసం హైదరాబాద్‌ వచ్చిన వెంకయ్యనాయుడు తిరిగి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం, ఆయన నివాసంలో దాదాపు రెండు గంటల పాటు సమావేశమై చర్చించడం చర్చనీయాంశంగా మారింది.

రాత్రి 7 గంటలకు జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో అభ్యర్థిని తేల్చనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ప్రకటించవచ్చన్న ఊహాగానాలు దేశ రాజధానిలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటనను బీజేపీ వెల్లడించలేదు. మరోవైపు దక్షిణాదిపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది.

ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తులను రాష్ట్రపతి చేసే ఆనవాయితీ కూడా గతంలో ఉంది. అదే ఆనవాయితీని ఇప్పుడు బీజేపీ కూడా కొనసాగిస్తే ఎన్డీయే రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు.. రాష్ట్రపతి భవన్‌లో అడుగు పెట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ పెద్దల మనసులో ఎవరున్నారనేది అధికార ప్రకటన వెలువడే వరకు సస్పెన్స్ తప్పదు. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పోటీ అభ్యర్థిని రాష్ట్రపతి రేసులో నిలిపేందుకు విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా పోటీకి సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు వీలుగానే ఆయన టీఎంసీ పార్టీకి రాజీనామా చేశారు. మొత్తానికి రాష్ట్రపతి రేసులో ఇటు ఎన్డీయే.. అటు విపక్షాల వ్యూహ, ప్రతివ్యూహాలతో హస్తిన రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story