VICE PRESIDENT: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎవరి బలం ఎంత?

పార్లమెంట్ హౌస్ లో ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు భవనం మొదటి అంతస్తులోని రూమ్ నంబరు ఎఫ్101 వసుధలో ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ను రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్, విపక్ష కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే పార్లమెంట్ భవనానికి చేరుకున్న మోదీ.. తొలి ఓటు వేశారు. ఓటింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులందరూ ఓటు హక్కును వినియోగిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ఇప్పటికే ఐదు ఖాళీగా), నామినేటెడ్ 12 మంది సభ్యులు, లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు (ఒక ఖాళీగా) ఓటు వేస్తారు. లోక్‌సభలో 542 మంది సభ్యులున్న ఎన్డీఏకి 293 మంది మద్దతు, రాజ్యసభలో 240 మంది సభ్యులున్న ఎన్డీఏకి 129 మంది మద్దతు ఉంది. మొత్తం రెండు సభల ఉమ్మడి బలం 786, గెలుపు కోసం 394 ఓట్లు అవసరం. ఎన్డీఏకి 422 ఓట్ల మద్దతు ఉండటంతో గెలుపు సులభం అని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేడీ దూరంగా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఎంఐఎం ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది, వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం జరుగుతుంది. అభ్యర్థి భారత పౌరుడు, కనీసం 35 సంవత్సరాలు పూర్తి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యే అర్హతలు కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో లాభదాయక పదవుల్లో ఉండకూడదు. ఎన్నిక ప్రొపోర్షనల్ రిప్రెజెంటేషన్ పద్ధతిలో, సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ ద్వారా రహస్య బల్లెట్ ద్వారా జరుగుతుంది. భారత ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది, తద్వారా ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం తప్పనిసరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

