ఎంత దారుణం.... ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జన

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ యువకుడిపై మద్యం మత్తులో ఉన్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. తొమ్మిది రోజుల క్రితం సిధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో జరిగిన ఈ దారుణం జరిగిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి బీజేపీ నేత అనుచరుడు కావడంతో ఇది రాజకీయ వివాదానికి కారణమైంది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. ఈ దారుణం ప్రభుత్వానికి కనిపించలేదా? నేరస్తుడిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు సిద్ధి బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లా అనుచరుడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కమలం పార్టీ నేతలతో ప్రవేశ్ శుక్లా ఉన్న ఫొటోలను విడుదల చేసింది. అయితే దీనిని ఖండించిన బీజేపీ... అతను తమ కార్యకర్త కాదని తెలిపింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో తన దృష్టికి వచ్చినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా స్పందించారు. ఇలాంటి హేయమైన చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలు అంతం కావాలన్నారు. ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నిందితుడిని అరెస్ట్ చేశాయని,అతనిపై 294, 504 IPC, SC/ST చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఈ వీడియో వైరల్ అవుతుందని... ప్రవేష్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నిందితుడి మేనమామ ముందే ఊహించాడు. అందుకే ప్రవేశ్ జూన్ 29 నుంచి కనపించడం లేదని జులై 1న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను SC, ST చట్టం కింద తప్పుడు కేసులో ఇరికించేందుకు కొందరు ఫేక్ వీడియో తీయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తెలిపారు. అది ఫేక్ వీడియో అని బాధితుడితో కూడా బలవంతంగా ఒక అఫిడవిట్ తయారు చేయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com