Himachal Political Crisis: అనర్హతకు గురైన ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్ సీఎం భేటీ

Himachal Political Crisis:   అనర్హతకు గురైన  ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్ సీఎం భేటీ
అలా చేస్తే అనర్హత వేటు వెనక్కి తీసుకుంటామని హామీ ఇస్తున్నారని ఊహాగానాలు

హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక రాజేసిన రాజకీయ చిచ్చును ఆర్పేందుకు కాంగ్రెస్‌ వేగంగా పావులు కదిపింది. రాజ్యసభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి ఓటు వేసిన.. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ద్వారా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య చర్చలు జరుపుతున్నారని తెలిసింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి సొంతగూటికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్, చేతన్య శర్మ, దేవిందర్ కుమార్‌తో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి విక్రమాదిత్యకు అప్పగించింది. వారు పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంటే అనర్హత వేటు వెనక్కి తీసుకుంటామని హామీ ఇస్తున్నారని హిమాచల్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

శాసనసభలో ఆర్థిక బిల్లు ఆమోదానికి ఓటు వేయాలని అధికార కాంగ్రెస్‌ ఇచ్చిన విప్‌ను ధిక్కరించారంటూ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ పథానియా పార్టీ గుర్తుపై ఎన్నికైనందున ఈ శాసనసభ్యులు కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని శిమ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్, రవి ఠాకూర్, చేతన్య శర్మలపై అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.

మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. అనంతరం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ జరిగిన ఓటింగ్‌కు వీరు దూరంగా ఉన్నారు. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని ఆ రాష్ట్ర గవర్నర్ శివ్‌ ప్రతాప్ శుక్లాను కలిసిన భాజపా నేతలు అసెంబ్లీలో బడ్జెట్‌ ఆమోదం పొందకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సభలో నినాదాలు చేసిన15 మంది భాజపా ఎమ్మెల్యేలను స్పీకర్‌ పఠానియా సస్పెండ్ చేశారు. అనంతరం మూజువాణి ఓటుతో.. ఆర్థిక బిల్లును సభ ఆమోదించింది. తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీని స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ బలం 68 నుంచి 62కి తగ్గింది. సభలో మెజారిటీ సంఖ్య కూడా 35 నుంచి 32 తగ్గింది. ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓటమికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ బాధ్యత వహిస్తున్నారని ఆ పార్టీ కేంద్ర పరిశీలకుడు డీకే శివకుమార్ చెప్పారు.ఇప్పుడు విభేదాలన్నీ తొలగిపోయాయని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను క్రమబద్ధీకరించడానికి..సీఎం, డిప్యూటీ సీఎం,రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సహా ముఖ్య నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనినిర్ణయించినట్టు శివకుమార్‌ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story