Manipur: మణిపూర్‌లో మరోసారి హింస

లోక్ సభ ఎన్నికలకు ముందు మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. కంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మెయితీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో అదనపు బలగాలను మోహరించారు. మరణించిన ఇద్దరు వ్యక్తులను కమ్మిన్‌లాల్ లుఫెంగ్ , కమ్లెంగ్‌సట్ లుంకిమ్ అని కాంగ్‌పోక్పిలోని కుకి-నివాస ఎల్ చాజాంగ్ గ్రామ చీఫ్ లెనిన్ హౌకిప్ తెలిపారు. నోంగ్‌డమ్ కుకీ, బొంగ్‌జాంగ్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిద్దరూ గ్రామ రక్షణ వాలంటీర్లుగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మణిపూర్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇటీవల శాంతియుత పరిస్థితులు నెలకొన్న రాష్ట్రంలో గురువారం నుంచి మూడు వేర్వేరు హింసాత్మక ఘటనలు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం తెంగ్నౌపాల్ వద్ద ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కాగా, గతేడాది మే నుంచి మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణలు నెలకొనడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 221 మంది మరణించగా..50,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com